Share News

2.25 లక్షల కొత్త పింఛన్లు

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:19 AM

రాష్ట్రంలో అర్హులైన 2,25,599 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, చేనేత...

2.25 లక్షల కొత్త పింఛన్లు

  • తలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకూ మంజూరు

  • ఇప్పటికే 1,599 మందిని గుర్తించి సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారులు

  • 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఆ రోజు ప్రకటించనున్న సీఎం

  • సెప్టెంబరు నుంచి మంజూరయ్యేలా యంత్రాంగం ఏర్పాట్లు

  • కొత్త పింఛన్లతో సర్కారుపై ఏటా రూ.500 కోట్ల అధిక భారం

  • ప్రస్తుతం ఏడాదికి పింఛన్ల ఖర్చు రూ.11,066 కోట్లు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన 2,25,599 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్‌ఐవీ-ఏఆర్‌టీ బాధితులు, ఫైలేరియా, డయాలసిస్‌ పేషెంట్లు, బీడీ ఠేకేదార్లకు పింఛన్లు అందుతున్నాయి. వారితోపాటు.. తలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఇటీవల నిర్వహించిన కుల గణన (సీపెక్‌ సర్వే), ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల ద్వారా వచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైనవారికి కేటగిరీలవారీగా పింఛన్లు మంజూరు చేసేందుకు సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ (సెర్ప్‌) అధికారులు చర్యలు చేపట్టారు. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు సీఎం రేవంత్‌రెడ్డి పింఛన్ల దరఖాస్తుల విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా జాబితాలోకి వచ్చిన వారికి సెప్టెంబరు నుంచి పింఛన్‌ అందనుంది. వాస్తవానికి తలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధులను ప్రభుత్వం 21 రకాల వ్యాధుల జాబితాలో చేర్చింది. దాంతో ఈ కేటగిరీలోని కొంతమందికి ఇప్పటికే పింఛన్‌లు అందుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వారు కాకుండా తలసీమియా, సికిల్‌సెల్‌ ఎనిమియా వ్యాధి బాధితులు 1,599 మంది సెర్ప్‌లో నమోదై ఉన్నారని, వారితో పాటు మరికొంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇక.. కొత్తగా గుర్తించిన వితంతువులు 2,03,000 మంది ఉన్నట్టు అంచనా.


అదే కోవలో చేనేత కార్మికులు 3 వేల మంది, గీత కార్మికులు 4 వేల మంది, దివ్యాంగులు 1.22 లక్షలు, 65 ఏళ్లు పైబడిన వాళ్లు లక్ష మంది, 57-64 ఏళ్లవారు 4 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులు ఎంతమంది అన్న విషయాన్ని 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌లో పరిశీలించనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి మొదటి దఫాలో 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్‌ వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఇటీవల లైవ్‌ అథెంటికేషన్‌ ద్వారా కొన్ని పింఛన్‌లను తొలగించారు. వాటి స్థానంలోనూ మరికొన్ని కొత్త పింఛన్‌లు ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రకాల కేటగిరీల్లో 41,06,552 మందికి పింఛన్‌ ఇస్తోంది. వీరందరికీ కలిపి నెలకు (జూలైలో ఇచ్చిన పింఛన్‌ లెక్క ప్రకారం) రూ.922.17 కోట్లను అందిస్తోంది. అంటే ఏడాదికి దాదాపు రూ.11,066 కోట్లు. ఇప్పుడు కొత్తగా మంజూరు చేయనున్న పింఛన్లతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

1-TS-National-4-08.jpg

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 06:27 AM