భూముల విలువల పెంపు..గరిష్ఠంగా 100 శాతమే!
ABN , Publish Date - May 19 , 2026 | 05:28 AM
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఎంత పెంచాలనే దానిపై అధికారులు ...
అంతకు మించి పెంచొద్దని నిర్ణయించిన ప్రభుత్వం
ఓఆర్‌ఆర్ లోపల ఎకరా కనిష్ఠ విలువ రూ.15 లక్షలు
ఔటర్‌ని ఆనుకుని హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలు
మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా రూ.5 లక్షలు
పంచాయతీల పరిధిలో రూ.2.75 లక్షల కనిష్ఠ విలువ
28 నుంచి కొత్త విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ
రూ.1000- రూ.1500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్న అధికారులు
హైదరాబాద్, మే 18 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారు అయింది. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఎంత పెంచాలనే దానిపై అధికారులు నివేదికలను సిద్ధంచేశారు. అయితే గరిష్ఠంగా 100 శాతం మించి పెంచకుండా సీలింగ్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో.. ఆయా ప్రాంతాల్లో ఉండే లావాదేవీల ఆధారంగా కనిష్ఠంగా 5 శాతం నుంచి 100శాతం వరకు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. 28 నుంచి కొత్త మార్కెట్ విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసింది. భూముల విలువల పెంపు ద్వారా ఈ ఏడాది అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి కార్డు విలువను కనిష్ఠంగా రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు.
మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎకరా కనిష్ఠ విలువ రూ.5 లక్షలుగా నిర్ణయించారు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల ఎకరా కనిష్ఠంగా రూ.15 లక్షలు, ఓఆర్‌ఆర్ ఆనుకుని ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరా రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
ఓఆర్‌ఆర్ లోపల చదరపు గజం విలువ కనిష్ఠంగా రూ.3500 నుంచి రూ.4 వేల లోపు ఉండదనుందని తెలిసింది.
ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఈ ధర రూ.3000 నుంచి రూ.3500 వరకు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2500 నుంచి రూ.3000 వరకు నిర్ణయించారు.
గ్రామీణ ప్రాంతాల పరిధిలో గజం కనిష్ఠ విలువ రూ.2000 వరకు ఉండనుంది.
ఓపెన్ ప్లాట్లకు సంబంధించి.. 15-20 శాతం ప్లాట్లకు వంద శాతం పెంపు వర్తించే అవకాశం ఉంది.
ఓఆర్‌ఆర్ లోపల రియల్ ఎస్టేట్ జోరుగా ఉన్నచోట్ల 50 శాతం ప్రాంతాల్లో ఫ్లాట్ల విలువను ఇప్పుడున్న దానికన్నా వంద శాతం పెంచుతున్నట్లు సమాచారం.