Share News

ఫ్యూచర్‌ సిటీ..నిర్మాణంలో రాజీ వద్దు

ABN , Publish Date - May 21 , 2026 | 03:46 AM

ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, నెట్‌ జీరో (కర్బన ఉద్గారాలు లేని) సిటీ తరహాలో రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

ఫ్యూచర్‌ సిటీ..నిర్మాణంలో రాజీ వద్దు

  • అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు

  • నెట్‌ జీరో సిటీగా తీర్చిదిద్దాలి

  • ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమలకు జూన్‌లో శంకుస్థాపన

  • పెట్టుబడుల ఆకర్షణకు ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరిట విభాగం

  • ఫ్యూచర్‌సిటీలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు,సివిల్‌ సర్వీస్‌ అధికారులకు 500 ఎకరాల కేటాయింపు

  • 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు

  • జిల్లాలకూ ఐటీ కంపెనీలు వచ్చేలా చర్యలు

  • 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ-ఫైబర్‌తో అనుసంధానం

  • ఐటీ, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, నెట్‌ జీరో (కర్బన ఉద్గారాలు లేని) సిటీ తరహాలో రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దని చెప్పారు. ఈ మేరకు ప్రపంచస్థాయి నగరాలను అధ్యయనం చేసి ఫ్యూచర్‌ సిటీ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం బోధి పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్‌ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాల నిర్మాణం తర్వాతే భూ కేటాయింపులు జరపాలన్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఫ్యూచర్‌ సిటీకి తీసుకువచ్చేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్‌ క్లస్టర్‌ను కూడా తీసుకొద్దామని, అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీని కలిసి హెల్త్‌ క్లస్టర్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామన్నారు. జూన్‌ నెలలో ఫ్యూచర్‌ సిటీ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమల నిర్మాణం ప్రారంభించేలా నిబంధనలు రూపొందించాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించటం కోసం ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పేరిట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, దీనికి లోగో, వెబ్‌సైట్‌ రూపొందించాలని ఆదేశించారు. పెట్టుబడులకు ముందుకొచ్చేవారికి ఎస్కార్ట్‌ ఆఫీసర్‌ వ్యవస్థను తీసుకురావాలని, గ్రూప్‌-1 స్థాయి అధికారులను నియమించాలన్నారు.


తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లోని పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. 1500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ బయట కూడా గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటు కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని, ఈ మేరకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలన్నారు. ఐటీ, ఇతర ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని.. ‘బియాండ్‌ క్యూర్‌’ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌) ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐటీ, డేటా సెంటర్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఐటీ విస్తరణ పెద్దగా లేని చోట్ల కూడా డేటా సెంటర్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని.. జీసీసీలు, డేటా సెంటర్ల కోసం కరీంనగర్‌, వరంగల్‌, విజయవాడ రహదారుల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూడు నెలల్లో టీ ఫైబర్‌కు అనుసంధానం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై త్వరలో సమీక్ష నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే టీ-ఫైబర్‌కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు సంబంధిత అధికారులు సీఎంకు తెలిపారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, సీఎస్‌ రామకృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 03:47 AM