తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. సీతక్క కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:03 PM
ఎల్‌నినో ప్రభావం తెలంగాణపైనా పడుతోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత, పంటల సాగుపై ప్రభావం ఉంటుందని పేర్కొంటూ.. తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని.. ఇది కేవలం రాష్ట్ర సరిహద్దులకే పరిమితమైన పరిస్థితి కాదని మంత్రి సీతక్క అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పుల కారణంగా ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులు.. నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఎల్‌నినో విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని.. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహిస్తూ కంటింజెన్సీ ప్రణాళికలను అమలు చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం కాపాడుతున్నామని, కృష్ణా, గోదావరి బేసిన్‌లోని జలాశయాల ద్వారా ప్రజలకు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి కొరతను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో పనిచేస్తోందని ఇప్పటికే మంత్రులు వెల్లడించారు. అదే సమయంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు అందించాలని సీతక్క కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా కీలకంగా మారుతున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, తాగునీటి నిర్వహణ వంటి అంశాలపై కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Also Read:
ఆసియా క్రీడల్లో భారత పతాకధారులుగా మనూ భాకర్, తజీందర్‌పాల్ సింగ్
పెళ్లికి నెల రోజుల ముందు దారుణం.. హత్య చేసి మురుగు కాలువలో పడేసి..