Share News

ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారం

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:59 AM

ప్రజాప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.21 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారం
pongulati

  • రాష్ట్రవ్యాప్తంగా 2.21 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

  • టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌

కూసుమంచి, కొత్తూర్‌/షాద్‌నగర్‌, కేసముద్రం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రజాప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.21 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో కలెక్టర్‌ దివాకరతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. గృహనిర్మాణ శాఖకు సంబంధించిన యాప్‌లో లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో ఖమ్మం అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాలేరులో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచారు. కాగా తెలంగాణను గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేఽందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌, షాద్‌నగర్‌ మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో మహే్‌షకుమార్‌గౌడ్‌ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి దీపావళి సంబురాలు జరుపుకొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మిఠాయిలు అందజేసి, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొని, శుభాకాంక్షలు తెలిపారు.


ఇందిరమ్మ ఇంట్లో సీఎం చిత్రపటంతో దీపావళి

సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నెరవేరడంతో మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో లబ్ధిదారులైన నూకల స్వప్న, రాంబాబు దంపతులు తమ కొత్త ఇంట్లో దీపావళిని స్వయంగా సీఎం రేవంత్‌ చిత్రపటంతో నిర్వహించుకోవడం విశేషం. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన తమ కల ఇందిరమ్మ పథకంతో నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. వారి పిల్లలు రిత్విక్‌, రిషిక సైతం ‘థాంక్యూ... సీఎం అంకుల్‌’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రమంతటా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి

రాష్ట్ర వ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు ఘనంగా, ఉత్సాహ భరితంగా సాగాయి. సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు మేరకు.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన సుమారు రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమిదలు వెలిగించారు. రాష్ట్రంలోని మారు మూల గిరిజన తండాలు మొదలు రాజధాని హైదరాబాద్‌ వరకూ ఈ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 06:21 AM