Share News

వారంలో ఒకరోజు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:47 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ నుంచి కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన అందించనున్నారు.

వారంలో ఒకరోజు!

  • ఫ్యూచర్‌ సిటీ నుంచే ముఖ్యమంత్రి రేవంత్‌ పాలన

  • ఎఫ్‌సీడీఏ భవనం మొదటి అంతస్తులో ప్రత్యేక చాంబర్‌

  • విదేశీ ప్రతినిధులు, వీఐపీలతో చర్చలకు అత్యాధునిక సమావేశ మందిరాలు, కాన్ఫరెన్స్‌ హాల్స్‌

  • ప్రతినిధులతో చర్చలు, ఒప్పందాలు ఇక్కడి నుంచే

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌ సిటీ నుంచి కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన అందించనున్నారు. వారంలో ఒకరోజు లేదా నెలలో మూడు, నాలుగు రోజులు అక్కడి నుంచే పాలన అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే కంపెనీలతో అక్కడే చర్చలు చేయనున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇందుకు వీలుగా ఆయన కోసం ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేశారు. నిజానికి, ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, డిప్యూటీ సీఎం వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఎఫ్‌సీడీఏ భవనాన్ని సుమారు రూ.20 కోట్లతో 15 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ప్లస్‌ వన్‌ విధానంలో నిర్మించారు. మొదటి అంతస్తులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లకు 400 చదరపు అడుగుల్లో ప్రత్యేక చాంబర్లను ఏర్పాటు చేశారు. పరిశ్రమల యాజమాన్యాలు, ఇతర వీఐపీలతో సమావేశాల కోసం దాదాపు 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని నిర్మించారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చే విదేశీ సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం అత్యాధునిక మీటింగ్‌ హాళ్లు, సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి కూడా నెలలో కొద్ది రోజులు ఇక్కడి నుంచే కార్యాకలాపాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.


నిజానికి, ‘‘ప్రపంచంలోని ఏ గొప్ప కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు నన్ను కలవడానికి వస్తే సచివాలయంలో కాదు.. ఎఫ్‌సీడీఏ భవనం నుంచే మాట్లాడతా. ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తా. నెలకు మూడుసార్లు వచ్చి ఇక్కడే కూర్చుంటా. డిప్యూటీ సీఎం, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కూడా నెలకు నాలుగుసార్లు వచ్చి ఇక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహించాలని సూచిస్తున్నా’’ అని ఎఫ్‌సీడీఏకు శంకుస్థాపన చేసిన 2025 సెప్టెంబరు 28న సీఎం రేవంత్‌ అన్నారు. అప్పట్లో అన్నట్లుగానే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీలో జరిగే అభివృద్ధి పనులు, భవనాలు, లే అవుట్లు, పరిశ్రమలకు ఇక్కడే అనుమతులు ఇస్తారు. గ్లోబల్‌ సమ్మిట్‌తోపాటు గత రెండేళ్లలో దావో్‌సలో చేసుకున్న పలు కంపెనీల ఒప్పందాలను ఫ్యూచర్‌ సిటీకే రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలను ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలను సీఎం అక్కడి నుంచే చేపట్టనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తద్వారా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యూచర్‌ సిటీ పేరు ప్రచారం జరుగుతుందని, ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని, నాలుగో సిటీగా అవతరిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 05:47 AM