Share News

అటక మీద డబ్బు సంచులు.. పరుపు కింద నోట్ల కట్టలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:40 AM

ల్యాండ్స్‌ అండ్‌ సర్వే విభాగంలోని మల్టీ జోన్‌ 2 డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

అటక మీద డబ్బు సంచులు.. పరుపు కింద నోట్ల కట్టలు

  • ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డీడీ నరహరి అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే!

  • నోట్ల కట్టలపై నిద్రిస్తున్న వైనం!

  • ఇంట్లో 1.54 కోట్ల నగదు గుర్తింపు

  • బ్యాంక్‌ బ్యాలెన్స్‌ రూ.2.29 కోట్లు

  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు..రూ.5.04 కోట్లు

  • ఖరీదైన ప్రాజెక్టుల్లో 4 ఫ్లాట్లు

  • 2 భవనాలు.. 5ఇళ్ల స్థలాల గుర్తింపు

హైదరాబాద్‌/చాంద్రాయణగుట్ట, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ల్యాండ్స్‌ అండ్‌ సర్వే విభాగంలోని మల్టీ జోన్‌ 2 డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని నరహరి ఇంట్లో, ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లల్లో మొత్తం 10చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపిన సోదాల్లో మంచం పరుపు కింద కోటీ 10 లక్షల రూపాయల నోట్ల కట్లను కనుగొన్నారు. వాటిపైనే ఆయన నిద్రిస్తున్న వైనం వెల్లడైంది. ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీని గుర్తించారు. ఈ డబ్బును లెక్కించడానికి కౌటింగ్‌ మెషిన్లను తీసుకొచ్చారు. నరహరి ఇంట్లో మొత్తం రూ.1.54 కోట్లు, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు, ఖరీదైన కియా కారు, ఆయన బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.5.04 కోట్లు, ఆయన పేరిట రెండు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లాకర్లను బుధవారం తెరచిచూస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఐదు ఇళ్ల స్థలాల పత్రాలు, మహేశ్వరం మండలంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలోని బహుళ అంతస్తుల భవనంలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్‌, నార్సింగ్‌లోని మరో ఖరీదైన హైరైజ్‌ కాంప్లెక్స్‌లో రెండు ఫ్లాట్లు, రాజేంద్ర నగర్‌లో మరో ఖరీదైన ప్రాజెక్టులో ఫ్లాట్‌, గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో జీ ప్లస్‌ 3 ఇల్లు, ఛత్రినాకాలోని జీ ప్లస్‌ 2 ఇంటి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ బాండ్‌ పేపర్లు, చెక్కు లు స్వాధీనం చేసుకున్నారు. నరహరి తన అక్రమార్జనను ఫైనాన్స్‌ దందాలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆయన బినామీల గురించి విచారణ జరుగుతోందని, త్వరలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసి ఆయనను విచారిస్తామని ఏసీడీ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్‌ లెక్కల ప్రకారం నరహరి వద్ద రూ.13,05,67,100 విలువైన అక్రమ ఆస్తులను గుర్తించామని, మార్కెట్‌లో వాటి విలువ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. దాదాపు వంద కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి సర్వే, సరిహద్దు వివాదాల పరిష్కారం, భూమి స్వాధీనానికి సంబంధించిన కీలక పత్రాలు జారీ చేసే బాధ్యతలను నరహరి నిర్వహిస్తున్న నేపథ్యంలో లంచం ఇవ్వనిదే ఆయన వద్ద నుంచి ఫైలు కదలదని కిందిస్థాయి ఉద్యోగులు పేర్కొంటున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో చదువుకుని ఉద్యోగం చేస్తున్న నరహరి కుమారుడి పేరు మీద ఆస్తులు ఉన్నాయని, వాటి విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌ తెలిపారు. బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

2.jpg


బంజారాహిల్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌పై విచారణకు ఆదేశం

రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బంజారాహిల్స్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సిరాజ్‌పై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఉత్తర్వులిచ్చారు. విచారణాధికారిగా రంగారెడ్డి జిల్లా డీఐజీ ట్వింకిల్‌ జాన్‌కు బాధ్యతలు అప్పగించారు. బంజారాహిల్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో 20 చదరపు గజాల రిజిస్ట్రేషన్‌ డీడ్‌లో 200 గజాలున్నట్లు చూపి సేల్‌ డీడ్‌ కు అనుమతించడం, అలాగే నిషేధిత జాబితాలోని వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌కు అనుమతించడంపై ఫిర్యాదులు అందాయి. వ్యవసాయ భూమి అని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌కు అనుమతించి ఆ డాక్యుమెంట్‌ను తిరస్కరించకుండా 3 నెలల పాటు పెండింగ్‌లో పెట్టడం, వివరణ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ను వివరణ కోరడంపై రిజిస్ట్రేషన్‌ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల క్రితం సిరాజ్‌పై అభియోగాలు నమోదు చేయగా ఆయన వివరణపై సంతృప్తి చెందని ఐజీ.. శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని విచారణాధికారికి సూచించారు.

Updated Date - Jun 17 , 2026 | 06:47 AM