ప్రజాధనానికి కాపలాదారులం
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:33 AM
ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
గొప్పల కోసం మభ్యపెట్టే మాటలు చెప్పం.. వాస్తవాల పునాదులపైనే పనిచేస్తున్నాం
దేశానికి గ్రోత్ ఇంజన్‌లా తెలంగాణ
బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదర్శవంతమైన పాలనలో రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నామన్నారు. తాము పాలకులం కాదని, ప్రజలకు సేవకులమని, వారికి చెందిన ప్రతి పైసాకూ కాపలాదారులుగా ఉంటున్నామని తెలిపారు. ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి.. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం సమర్పించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం చేస్తూ, ‘‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. ఈ రెండేళ్లలోనే రాష్ర్టానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. మేం ఎంచుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేయడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీనిని రూపొందించాం. గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పని చేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం, ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా.. బాధ్యతతోనే వారికి సమాధానం చెబుతాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి’’ అని భట్టి వివరించారు.
బలమైన గ్రోత్ ఇంజన్‌గా తెలంగాణ..
‘‘2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ప్రస్తుత ధరల ప్రకారం రూ.17,82,198 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే.. వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడీపీ రూ.3,57,13,886 కోట్లు, వృద్ధిరేటు 8 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధిరేటు దేశ సగటు వృద్ధిరేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉంది. అదే విధంగా దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ 5.0 శాతం వాటా కలిగి.. ఒక బలమైన గ్రోత్ ఇంజన్‌గా తెలంగాణ నిలుస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.2,19,575గా ఉంది. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,99,356 ఎక్కువ. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఏ రాష్ర్టానికైనా ఆర్థిక క్రమశిక్షణ అనేది అభివృద్ధికి మూలాధారం. గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్ వ్యవస్థీకరించాం.
రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి, అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పొడిగించాం. ఈ నిర్ణయం వల్ల 2025-26 నుంచి 2031-32 దాకా చెల్లించాల్సిన రుణభారం ఏటా రూ.34,580కోట్ల నుంచి రూ.11,915కోట్లకు తగ్గింది. దీని ద్వారా రాష్ర్టానికి రూ.22,142 కోట్ల క్యాష్ ఔట్‌ఫ్లో తగ్గి.. నగదు వెసులుబాటు కలిగింది. టీయూఎఫ్‌ఐడీసీ సంస్థ 10.2 శాతం వడ్డీతో తీసుకున్న రూ.172.02 కోట్లు, తెలంగాణ రోడ్డు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ 9.7 శాతం వడ్డీతో తీసుకున్న రూ.2,204.06 కోట్ల రుణాలను 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నాం’’ అని వివరించారు. తెలంగాణలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరం అని ప్రజలు అనుకునేలా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నామని భట్టి తెలిపారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా దూరమైతే.. ఆ కుటుంబం పడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటి. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ భయం, అభద్రతా భావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకూ ఉండకూడదన్నదే మా ప్రభుత్వ సంకల్పం. దీనికోసం సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్య తరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని కోటి 15లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా కల్పిస్తూ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను జూన్ 2 నుంచి అమల్లోకి తేనున్నాం’’అని వివరించారు. 2023 డిసెంబరు నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30,377 పడకలు అందుబాటులో ఉండగా, కొత్తగా ప్రారంభించిన 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా మరో 1,980 టెరిటరీ కేర్ పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2026 చివరి నాటికి సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్‌లోని టిమ్స్ ఆస్పత్రులతోపాటు విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోకలిపి మరో 6,582 టెరిటరీ కేర్ పడకలను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని, ప్రతి వెయ్యి మందికి ఒక పడక ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉండే ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ను రాష్ట్రంలోని ప్రజలందరికీ అమలు చేస్తున్నామన్నారు.
ఎస్సీలకు 11,784 కోట్లు, ఎస్టీలకు 7,937 కోట్లు
లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద కొత్తగా అంబేడ్కర్ నాలెడ్జ్ టవర్‌ను నిర్మించనున్నామని భట్టి చెప్పారు. కాచిగూడ నింబోలి అడ్డాలో బాబూ జగ్జీవన్‌రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి రూ.11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లను ప్రతిపాదించామని వెల్లడించారు. బీసీ సంక్షేమానికి రూ.12,511 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.3769 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నరేగా స్థానంలో వీజీ జీరామ్ చట్టాన్ని తెచ్చిందని, దీనిని శాసనసభలో ఏకగ్రీవంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. పాత చట్టం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులు ఇస్తే... కొత్త చట్టంతో 60 శాతం నిధులు మాత్రమే ఇస్తుందని చెప్పారు. ఇది మళ్లీ వలసలను ప్రోత్సహిస్తుందని అన్నారు. తెలంగాణలో 90 శాతం లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే నని, బడ్జెట్ పరిమితుల వల్ల వీరి జీవనోపాధికి పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.
2 గంటల ప్రసంగం
భట్టి బడ్జెట్ ప్రసంగం రెండు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగింది. మధ్యాహ్నం 12:03 గంటలకు ప్రారంభించి.. 1:57 గంటలకు ముగించారు. చివరి 15 నిమిషాల పాటు ప్రసంగానికి అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ స్వాగతించారు. కాగా, బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రాణహిత- చేవెళ్లను చేపడతాం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపడతామని డిప్యూటీ సీఎం అన్నారు. ‘‘ఈ బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.22,615 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. మూసీనది పునరుద్ధరణ కోసం 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టు తొలిదశ ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీటిని మూసీకి అందిస్తాం. మూసీనది బఫర్ జోన్‌లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాం’’ అని వివరించారు. మావోయిస్టుల సమస్యను గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రత ల సమస్యగానే పరిగణిస్తే.. తాము సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి చర్యలు తీసుకున్నామని అన్నారు. 2014 నుంచి 2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోతే.. 2023 డిసెంబరు నుంచి ఇప్పటిదాకా 732 మంది లొంగిపోయారని తెలిపారు. నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక, అసమానతలను రూపుమాపడం ద్వారానే.. ఆ ఉద్యమానికి ముగింపు పలకగలమని ప్రభుత్వం నిరూపించిందన్నారు.

మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉత్తమ్
శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. చట్టసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆయనకు ఇదే మొదటిసారి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఉత్తమ్ బడ్జెట్ ప్రసంగం 1.50 గంటలకు ముగిసింది. 70 పేజీలు ఉన్న ఇంగ్లీష్ కాపీని గంటా 50 నిమిషాలపాటు చదివారు. ఆయన బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సమయంలో.. మంత్రి శ్రీధర్‌బాబు కూడా మండలిలోనే ఉన్నారు. ఉత్తమ్ తన ప్రసంగంలో ఆరు గ్యారెంటీలు, ముఖ్యమైన సంక్షేమ పథకాలు, కొత్త పథకాల ప్రస్తావన వచ్చినపుడు గట్టిగా నొక్కి చదివారు. ఆ సమయంలో కొత్తగా మండలిలో విప్‌గా నియమితులైన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహే్‌షకుమార్‌గౌడ్ గట్టిగా బల్లలు చరిచారు. రేషన్ కార్డులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే పేదలకు రేషన్‌కార్డులు పంపిణీ చేశామని ఉత్తమ్ అనగానే... బీఆర్‌ఎస్ సభ్యులు ఫేక్, ఫేక్ అని అరిచారు. గత ప్రభుత్వ పథకాల ప్రస్తావన చేసినపుడు ‘దటీజ్ కేసీఆర్’ అని అరిచారు. ఉత్తమ్ బడ్జెట్ ప్రసంగం ముగియగానే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కుర్చీలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
బడ్జెట్ ప్రతులు చించి.. చెవుల్లో పూలు పెట్టుకొని..
బడ్జెట్ సందర్భంగా శాసనసభలో బీఆర్‌ఎస్ సభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి ‘ఫాల్స్.. బోగస్.. జోక్’ అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో బడ్జెట్ ప్రతులను చించి.. చెవుల్లో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ‘ఆరు గ్యారంటీలు బోగస్, తులం బంగారం, మహిళలకు రూ.4 వేలు ఏవీ?’ అని నినాదాలు చేస్తూ బడ్జెట్ మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ ఏడాది 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు
చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్హులైన లబ్ధిదారులకు ఊరట కల్పిస్తూ.. ఈ ఏడాది కొత్తగా 2లక్షల మందికి చేయూత పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యం బారిన పడ్డవారు, చేనేత, బీడీ కార్మికులు, ఇతర చేతివృత్తుల వారికి అండగా నిలిచే విధంగా చేయూత పథకంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందుకుగాను బడ్జెట్‌లో చేయూత కోసం రూ.14,861 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద 41.50 లక్షలమందికి పింఛన్లను అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం ప్రతినెలా 950కోట్ల వరకు వెచ్చిస్తోంది. రెండేళ్లలో కొత్తగా చేయూత పింఛన్లను మంజూరు చేయలేదు. ఆయా కుటుంబాల్లో చేయూత లబ్ధి పొందుతున్న భర్త మరణిస్తే.. భార్యకు, ఒకవేళ భార్య చనిపోతే భర్తకు వారిస్థానంలో పింఛన్ మంజూరు చేశారు. ఆ విధానంలో ఏడాదిలో 85వేలమందిని పింఛను జాబితాలో చేర్చారు. ఈ ఏడాది 2లక్షల మందికి చేయూత లబ్దిని అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. పెన్షన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను అధికారులు పరిశీలించనున్నారు.