Share News

డీఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు సుప్రీంలో ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:35 AM

ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా మార్చి ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

డీఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు సుప్రీంలో ఎదురుదెబ్బ!
rice mill

  • తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలన్న విజ్ఞప్తులను తోసిపుచ్చిన కోర్టు

  • బియ్యం బకాయిలన్నీ చెల్లించాల్సిందే

  • పౌరసరఫరాల కమిషనర్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)గా మార్చి ఇవ్వకుండా ఎగ్గొట్టిన రైస్‌ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ రాష్ట్ర మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లను (ఎస్‌ఎల్‌పీ) కోర్టు తోసిపుచ్చింది. దీనితో మిల్లర్లపై కేసులు, దర్యాప్తు, ప్రభుత్వ చర్యలు యథాతథంగా కొనసాగుతాయి. దీనిని తప్పించుకోవాలంటే మిల్లర్లు తప్పనిసరిగా బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2022లో ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసి కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌మిల్లర్లకు అప్పగించింది. నిబంధనల ప్రకారం మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి 67 శాతం ముడి బియ్యం లేదా 68 శాతం ఉప్పుడు బియ్యం నిష్పత్తిలో తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. అయితే, చాముండేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఎండీ కాసం సాత్విక్‌తోపాటు మరికొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని, బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి, సొమ్ము చేసుకున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ఈ క్రమంలో సుమారు రూ.3,960 కోట్ల విలువైన ధాన్యం బకాయిలకు సంబంధించి మిల్లర్లపై 540 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ 57 మంది రైస్‌ మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించారు.


sc-court6.jpgహైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకు..

ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందం మాత్రమేనని, ఇది పూర్తిగా సివిల్‌ వివాదమని, ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌ (మధ్యవర్తిత్వం) నిబంధన ఉన్నందున పోలీసు కేసులు చెల్లవని మిల్లర్లు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించని హైకోర్టు మిల్లర్ల పిటిషన్లను కొట్టివేసింది. దీనితో కొందరు మిల్లర్లు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌నాగుతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. సీఎంఆర్‌ విధానం పూర్తిగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందమని.. ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేశారని, సివిల్‌ వివాదంపై క్రిమినల్‌ కేసులు పెట్టారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. పిటిషన్లను కొట్టివేస్తామని పేర్కొంది. అయితే పిటిషన్‌ ఉపసంహరణకు అవకాశం కల్పించాలని కోరడంతో ధర్మాసనం అంగీకరించి.. ‘డిస్మిసెడ్ యాస్‌ విత్‌డ్రా’గా ప్రకటించింది.

నిజాయతీగా బకాయిలు చెల్లించండి

ప్రభుత్వనికి బకాయిపడిన రైస్‌ మిల్లర్లంతా తమ వ్యాపారాన్ని సజావుగా, నిజాయతీగా కొనసాగించాలని.. సీఎంఆర్‌ బకాయులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వై.నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రైస్‌మిల్లుల పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని.. కస్టమ్‌ మిల్లింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కోరారు. ఏవైనా న్యాయమైన సమస్యలుంటే చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధాన్యాన్ని దుర్వినియోగం చేసినా, సీఎంఆర్‌, పీడీఎస్‌ బియ్యంతో అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా చర్యలు తప్పవని.. రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Nov 21 , 2026 | 04:37 AM