సాకులు అంగీకరించం!
ABN , Publish Date - Sep 16 , 2026 | 04:27 AM
లోతుకుంటలోని 40 ఎకరాల భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కాలపరిమితి ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలో సర్వే నంబర్ 1, 2లో ఉన్న 40 ఎకరాల భూములపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ వివాదం హైకోర్టుకు చేరడంతో.. విచారణ జరిపి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
వ్యవస్థలో కొంత క్రమశిక్షణ ఉండాలి
లోతుకుంట భూముల అంశంలో
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
లోతుకుంట భూమిపై సమగ్ర సర్వే!
సంబంధిత విభాగాలతో
చర్చించనున్న హైడ్రా
40 ఎకరాల భూమి అంశంలో
ప్రభుత్వం, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్
మధ్య వివాదం
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): లోతుకుంటలోని 40 ఎకరాల భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కాలపరిమితి ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో కొట్టివేస్తున్నట్టు స్పష్టం చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలో సర్వే నంబర్ 1, 2లో ఉన్న 40 ఎకరాల భూములపై శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ వివాదం హైకోర్టుకు చేరడంతో.. విచారణ జరిపి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం చర్చనీయాంశమైంది.దానిపై మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్.. ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా, న్యాయవాదులు అల్లంకి రమేష్, జీషాన్ అద్నాన్ మహమూద్ హాజరయ్యారు. అయితే ఎస్‌ఎల్‌పీ దాఖలులో ప్రభుత్వం 219 రోజులు జాప్యం చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలులో ఆలస్యాన్ని మన్నించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌ను పరిశీలించింది. అయితే ఆలస్యానికి చూపిన కారణం ఏమాత్రం సహేతుకంగా లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. కాలపరిమితి చట్టం నిబంధనలను పాటించకపోవడాన్ని తప్పుపట్టింది
. సాకులను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని జస్టిస్ దీపాంకర్ దత్తా పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేయడానికి ఆరు నెలల పాటు ఎందుకు నిరీక్షించారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరికీ ‘లిమిటేషన్ చట్టం’ అంటే గౌరవం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. వ్యవస్థలో కొంత క్రమశిక్షణ ఉండాలని వ్యాఖ్యానించారు. అయితే.. ఒక అవకాశం ఇవ్వాలని, సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణతో కూడిన అఫిడవిట్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్ విజ్ఞప్తి చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నష్టపోవద్దని, అధికారులెవరైనా తప్పుదారి పట్టించి ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. కానీ అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. అఫిడవిట్ వేయడం కుదరదని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. లోతుకుంట భూ వివాదంపై సమగ్ర సర్వే చేయాలని హైడ్రా భావిస్తోంది. రెవెన్యూ, ఇతర విభాగాలతో ఈ విషయంపై చర్చించనున్నట్టు సంస్థ వర్గాలు వెల్లడించాయి. న్యాయ నిపుణులతో చర్చించి ఎలా ముందుకు వెళ్లాలన్నది నిర్ణయిస్తామని పేర్కొన్నాయి. లోతుకుంట జీఎల్‌ఆర్ 243 పరిధిలోని 119ఎకరాలపై సర్వే చేస్తే వాస్తవాలు తెలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపాయి. కాగా, ఈ భూమికి సంబంధించిన అంశంలోనే తమ ఆదేశాలను అమలు చేయలేదంటూ హైడ్రా కమిషనర్‌ను తొలగించాలని హైకోర్టు సింగిల్‌జడ్జి ఇటీవల ఆదేశించారు. ప్రభుత్వం అప్పీలు చేయడంతో డివిజన్ బెంచ్ తాత్కాలిక స్టే ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడం చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
కొత్త UPI మార్గదర్శకాలు: ఎవరికి ఛార్జీలు? ఎవరికి ఉచితం?
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల