Share News

శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయండి

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:12 AM

శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసి, నీటిని దిగువకు వదిలిపెట్టడంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) అభ్యంతరం తెలిపింది.

శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయండి
Srisailam

  • శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయండి

  • తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

  • ఏపీ తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

  • కృష్ణా జలాల పంపిణీపై ప్రతిష్ఠంభన

  • తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసి, నీటిని దిగువకు వదిలిపెట్టడంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) అభ్యంతరం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 షెడ్యూల్‌-11లోని పేరా-2, 3ని నియమాలను పాటిస్తూ తక్షణమే జలవిద్యుత్‌ ఉత్పాదన నిలిపివేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శికి కృష్ణాబోర్డు శుక్రవారం లేఖ రాసింది. శ్రీశైలంలోని నీటి నిల్వను తాగునీటి అవసరాల కోసమే వాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. నీటి వినియోగం విషయంలో తాగునీటికి, సాగునీటికి మధ్య పోటీ ఏర్పడినప్పుడు తొలుత తాగునీటి అవసరాలే ముఖ్యం అని కృష్ణా బోర్డు పేర్కొంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పాదన చేస్తూ సాగర్‌లో అవసరాలు లేకున్నా నీటిని తరలిస్తున్నారని, తక్షణమే జలవిద్యుత్‌ ఉత్పాదనను అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవలే, కృష్ణాబోర్డుకు శుక్రవారం ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతున్నందున.. ఏపీ తాగునీటి అవసరాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నివేదించారు. ఏపీ లేఖపై కృష్ణాబోర్డు శరవేగంగా స్పందించి.. తెలంగాణకు అత్యవసరంగా లేఖ రాసింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, దీనివల్ల ప్రస్తుత నీటి సంవత్సరంలో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండే అవకాశాలు లేవని పేర్కొంది. అంతంతమాత్రంగా ఉన్న నిల్వలను పొదుపుగా వాడుకోవడం అవసరమని, ఈ నిల్వలన్నీ తాగునీటి అవసరాలకే వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపింది.


కృష్ణా జలాల పంపిణీపై వచ్చే బోర్డు భేటీలో చర్చించాలని నిర్ణయం

కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి జలాశయాల్లో నీటి పంపిణీపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు చెందిన త్రిసభ్య కమిటీ రెండో సమావేశంలోనూ తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. కృష్ణాబోర్డు మెంబర్‌ సెక్రటరీ సతీష్‌ కంభోజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) రమేశ్‌బాబు, ఏపీ ఈఎన్‌సీ(ఇరిగేషన్‌) నర్సింహమూర్తి హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం జరగ్గా.. నీటి పంపిణీపై సయోధ్య కుదరకపోవడంతో ఈ అంశంపై సెప్టెంబరు మూడో వారంలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వాటర్‌ ఇయర్‌లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నుంచి 200 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను 50:50 శాతం నిష్పత్తితో పంచాలని డిమాండ్‌ చేసింది. 66:34 నిష్పత్తికి అంగీకరించబోమని గత మూడేళ్లుగా వాదన వినిపిస్తున్నామని పేర్కొంది. 50:50 శాతం నిష్పత్తి ప్రకారం ఏపీకి ఇక 36.37 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జలాశయాల్లో నీటిని తాగునీటి అవసరాలకే కేటాయించాలని తెలంగాణ పట్టుబట్టింది. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాగర్‌లో తాగునీటి అవసరాలు లేనప్పటికీ తెలంగాణ ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేసిందని పేర్కొంది. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి వాటాకు లోబడి నీటిని తరలిస్తున్నామని, పరిమితికి మించి నీటిని తరలించడంలేదని తెలిపింది. ఏపీకి 512 టీఎంసీలు(66 శాతం) వాటా ఉందని తేల్చిచెప్పింది. కాగా, తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్‌, ఆర్డీఎస్‌పై మూడు రాష్ట్రాల అధికారులతో వేసిన ఉన్నతస్థాయి కమిటీకి అనుబంధంగా ఉప కమిటీని వేస్తూ తుంగభద్ర బోర్డు కార్యదర్శి బైరి శ్రీనివాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి చైర్మన్‌గా బోర్డు కార్యదర్శి బైరి శ్రీనివాస్‌ ఉంటారు. కమిటీలో ఏపీ నుంచి ఒంగోలు చీఫ్‌ ఇంజనీర్‌ కె.రమేశ్‌, కర్ణాటక నుంచి మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌.హెచ్‌ మంజప్ప, తెలంగాణ నుంచి వనపర్తి చీఫ్‌ ఇంజనీర్‌ మహమ్మద్‌ రహీముద్దీన్‌ ఉంటారు. కమిటీ కన్వీనర్‌/సభ్యకార్యదర్శిగా తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ ఎస్‌.నారాయణ్‌ నాయక్‌ ఉంటారు.

Updated Date - Sep 05 , 2026 | 06:13 AM