ఆ పెద్దాయన కేసీఆరేనా?
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:34 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన ‘పెద్దాయన’ ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి.. రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి.. వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి..
రాధాకిషన్‌రావు చెప్పింది ఆయన గురించేనా?.. అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు?
సీఎంవో నుంచి ఫోన్ నంబర్లున్నచిట్టీలు మీరే పంపారా?
ఎస్‌ఐబీలోని చాలామందితో నేరుగా ఎందుకు మాట్లాడారు?
సంతోష్‌రావుపై సిట్ ప్రశ్నల వర్షం
కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుని ప్రశ్నలు
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తావనకు వచ్చిన ‘పెద్దాయన’ ఎవరు? అప్పటి సీఎం కేసీఆరేనా? మావోయిస్టుల పేరు చెప్పి.. రివ్యూ కమిటీ కళ్లకు గంతలు కట్టి.. వేలాది మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్ చేయించి.. వారిపై నిఘా పెట్టించడం అంతా కేసీఆర్‌కు తెలిసే జరిగిందా? లేక కేసీఆర్ మాట అంటూ ఆయన పేరిట మీరే అధికారులకు ఫోన్లు చేశారా? ఎస్‌ఐబీ లేదా టాస్క్‌ఫోర్స్ అధికారులను మీరు ఏయే విషయాల కోసం సంప్రదించేవారు? ఆనాటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు పదవీ విరమణ పొందిన తరువాత.. వారి కొనసాగింపునకు ఆదేశాలు ఎలా వచ్చాయి? నాటి డీజీపీతో కేసీఆర్ ఆదేశాలంటూ మాట్లాడింది ఎవరు? అంటూ సిట్ అధికారులు.. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం కేసీఆర్ సన్నిహితుడైన సంతోష్‌రావును వారు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన సంతోష్‌రావును రాత్రి 10.30 గంటల దాకా సుదీర్ఘంగా విచారించారు. ఆనాటి సీఎం కేసీఆర్ తరఫున సంతోష్‌రావు అన్నీ తానై చక్రం తిప్పిన నేపథ్యంలో.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. విచారణలో పూర్తిగా కేసీఆరే లక్ష్యంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించిన సిట్ అధికారులు.. నాలుగు వైపుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఇక తదుపరి నోటీసు కేసీఆర్‌కేనని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈలోపు వీలుంటే కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్‌ను విచారించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
సాక్ష్యాధారాలతో విచారణ..
ఫోన్ ట్యాపింగ్‌కు మూలమైన రాజకీయ కోణాలను బయటపెట్టే క్రమంలో సంతోష్‌రావు విచారణ ముఖ్యమైనదని సిట్ అధికారులు భావిస్తున్నారు. అందుకే అత్యంత పకడ్బందీగా, సాక్ష్యాధారాలతో సహా ఆయనను విచారించారు. నాటి సీఎంవోలో ఆదేశాలు ఇచ్చే విధానం, అధికారులకు నేరుగా ఫోన్లు చేయడం తదితర అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్న ‘పెద్దాయన’ విషయాన్ని, నిఘా పెట్టాల్సినవారి ఫోన్ నంబర్లు సీఎంవో ద్వారా కాగితపు చిట్టీల్లో తమకు అందేవన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దాయన అంటే కేసీఆర్ కదా! అంటూ సంతోష్‌రావును సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతోపాటు ఆనాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు.. ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలను కూడా చూసిన నేపథ్యంలో ఆయనకు నాటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా వెళ్లేవో తెలుసుకోవడానికి సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. అప్పట్లో కేసీఆర్‌ను ఎవరు కలవాలన్నా సంతోష్‌రావు అనుమతి ఉంటేనే సాధ్యపడేదన్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ.. ‘అంతా మీరే చక్కదిద్దారు కాబట్టి అసలు సంగతి చెబితే బాగుంటుంది’ అంటూ సిట్ అధికారులు కొంత మెత్తగా మాట్లాడుతూనే.. కీలక సాక్ష్యాధారాలను, కొన్ని వాట్సాప్ చాట్లు, వాట్సాప్ కాల్ డిటైల్స్‌ను ఆయన ముందు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశారని తెలుస్తోంది.
కీలకం కానున్న సంతోష్ జవాబులు
ఇప్పటివరకు జరిగిన విచారణలో అనధికార ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగిందన్న విషయంపై సిట్ అధికారులు కొంత స్పష్టతకు వచ్చారు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అన్నదానిపై స్పష్టత వచ్చేందుకు సంతోష్‌రావు సమాధానాలు కీలకం కానున్నాయని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. ఇందుకోసం.. ఈ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులు రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుతోపాటు విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్‌రావుతో.. సంతోష్‌రావు పలుమార్లు నేరుగా మాట్లాడిన విషయాలను సిట్ అధికారులు ప్రస్తావించినట్లు తెలిసింది. కింది స్థాయి పోలీసు అధికారులతో మాట్లాడాల్సిన అవసరమేంటని వారు ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో నాటి సీఎం కేసీఆర్ ఆదేశాలతో మీరు ఎస్‌ఐబీ లేదా టాస్క్‌ఫోర్స్ అధికారులను ఏయే విషయాల కోసం సంప్రదించేవారు? లేదా నాటి కమిషనర్‌కు, డీజీపీకి చెప్పి ఊరుకునేవారా? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తంగా విచారణ అత్యధికంగా కేసీఆర్ చుట్టూనే తిరగడంతో అనేక ప్రశ్నలకు సంతోష్‌రావు సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.
ఇక కేసీఆర్ వంతు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ తుది దశకు చేరుకోవడం, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు విచారణ ముగియడంతో.. తదుపరి సిట్ నోటీసులు మాజీ సీఎం కేసీఆర్‌కు అందవచ్చని తెలుస్తోంది. అయితే కేసీఆర్‌ను విచారించడానికి పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే ముందుకెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఒకదాని తరువాత మరో కోణంలో విచారణ పూర్తి చేసుకుంటూ ఆధారాలను సేకరించుకుంటూ వచ్చారు. వాటన్నింటి ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించడానికి సన్నద్ధమవుతున్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించడానికి ముందు.. ఇప్పటివరకు జరిగిన విచారణపై మరోసారి పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులతోపాటు బీజేపీ అగ్రనాయకులైన బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేయించడం, టీఎ్‌సపీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేయించడం, పలువురు జర్నలిస్టులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలపై నిఘా పెట్టిన అంశాలపై సిట్ అధికారులు విచారణ జరిపారు. ఎవరి ఆదేశాలతో ఇవన్నీ జరిగాయన్నది నిర్ధారించేందుకు వివిధ కోణాల్లో ఇప్పటికే సాఽక్ష్యాధారాలను సేకరించారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను విచారణకు పిలవాలా? లేక ఆయన ఫాంహౌ్‌సకు వె ళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేయాలా? అనే అంశంలో త్వరలో సిట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.