బిగ్ షాక్.. కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్..
ABN , Publish Date - Jan 30 , 2026 | 06:31 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ఎక్కడ విచారించాలనే అంశంపై సిట్ అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే విచారించాలని నిర్ణయించారు..
హైదరాబాద్, జనవరి 29: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. సిట్ అధికారులు శుక్రవారం మరోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కాగా, నిన్న( గురువారం) సిట్ అధికారులు కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు.
ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. ఈ మేరకు సిట్ అధికారులకు గురువారం లేఖ రాశారు. శుక్రవారం విచారణకు హాజరు కాలేనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను ఎక్కడ విచారించాలనే దానిపై సిట్ అధికారులు ఈ రోజు సమావేశం నిర్వహించి, న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాకుండా హైదరాబాద్‌లోనే విచారించాలని నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి..
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ప్రభుత్వానికి సిట్ లేఖ
నడి రోడ్డుపై వృద్ధురాలి అంత్యక్రియలు.. కారణం ఏంటంటే..