రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుపై సింగపూర్ ఆసక్తి
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:53 AM
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగ్‌పూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు బుధవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ తన బృందంతో భేటీ అయ్యారు.
రేవంత్‌తో ఆ దేశ అధికారి భేటీ
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగ్‌పూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు బుధవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ తన బృందంతో భేటీ అయ్యారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తొలిదశలో మూసా, ఈసీ నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు వారికి సీఎం వివరించారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్‌గానూ తీర్చిదిద్దుతున్నామని ఆయన వివరించారు. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్‌షోర్ క్యాంప్‌సలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన విషయాన్ని సీఎం రేవంత్ సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్రాభివృద్థికి ఆర్థికపరమైన సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు సింగపూర్ సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని సింగపూర్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.