షాబాద్ ఆరు హత్యల కేసు.. ఆ వదంతులు నమ్మవద్దన్న డీసీపీ
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:31 AM
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కాడంటూ జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని చెప్పారు.
హైదరాబాద్, జులై 12: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కాడంటూ జరుగుతున్న ప్రచారంపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘షాబాద్ ఆరు హత్యల కేసులో దర్యాప్తును వేగవంతం చేశాము. నిందితుడి కోసం మొత్తం తొమ్మిది బృందాలతో గాలిస్తున్నాం. నిందితుడు చేగురు రైల్వే ట్రాక్ దాటి అడవి ప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నాం. రాజ్‌కుమార్ తన మొబైల్ ఫోన్‌ను శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు. రాజ్‌కుమార్ కోసం రైల్వే పోలీస్, ట్రాకింగ్ టీమ్, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ టీమ్స్‌తో 9 బృందాలు గాలిస్తున్నాయి.
పోక్సో కేసు పెట్టారని..
మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన రాజ్‌కుమార్ కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, ముక్కుపచ్చలారని ఇద్దరు పసిపిల్లలను గొంతుకోసి చంపాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ నరమేధం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.
మృతుల వివరాలు..
నిందితుడు రాజ్‌కుమార్ చేతిలో బలైన వారిలో మైనర్ బాలిక(17), ఆమె తల్లి చిట్యాల లక్ష్మి(45), బాలిక నానమ్మ చిట్యాల రుక్కమ్మ(65)తోపాటు అతని భార్య సరిత(30), కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2) ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఐఐటీ కాదు.. ప్రతిభకే పట్టం.. అదిరే ప్యాకేజీతో అమెరికాలో జాబ్
ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు.. మిస్ అవ్వకండి