కేటీఆర్.. రాజీనామా చెయ్
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:20 AM
మహిళలకు రూ.57 వేలకోట్ల రుణాలిచ్చినట్లు నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తానన్నావు కదా.. ఇవిగో లెక్కలు.. మాటకు కట్టుబడి ఉండే వ్యక్తివైతే వెంటనే రాజీనామా చెయ్ అంటూ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు.
మేమొచ్చాక మహిళా సంఘాలకు 57వేల కోట్ల రుణాలిప్పించాం: సీతక్క
శాసనసభలో లెక్కలు వెల్లడించిన మంత్రి
మహిళలంటే అంత చులకన ఎందుకని ప్రశ్న
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు రూ.57 వేలకోట్ల రుణాలిచ్చినట్లు నిరూపిస్తే.. పదవికి రాజీనామా చేస్తానన్నావు కదా.. ఇవిగో లెక్కలు.. మాటకు కట్టుబడి ఉండే వ్యక్తివైతే వెంటనే రాజీనామా చెయ్ అంటూ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. అసెంబ్లీలో మంగళవారం ఆమె మాట్లాడుతూ పదేళ్ల పాలనలో మహిళలకు బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు. తాము వచ్చాక రూ,57,937 కోట్ల మేర బ్యాంకుల ద్వారా రుణాలను సమకూర్చామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంటే ఎందుకు ఓర్వలేక పోతున్నారు? మహిళలంటే ఎందుకంత చులకన? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మూతపడిన శిల్పారామంలో మహిళలకు 106 షాపులు పెట్టిస్తే... మంచిగా వ్యాపారం చేసుకుంటున్నారని తెలిపారు. మేడారంలో 565 మంది మహిళలకు రూ.6.60 కోట్ల రుణం ఇచ్చి షాపులు పెట్టిస్తే... 15 రోజుల్లోనే 9.90 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు రుణం ఇస్తున్నామని, బీఆర్‌ఎస్ హయాంలో రుణ పరిమితిని రూ.5లక్షలకు తగ్గించిన ఘనత ఆప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకే దక్కుతుందన్నారు. ఆఖరికి అభయహస్తం సొమ్ము రూ.3వేల కోట్లనూ వాడుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హాయంలో ఎస్‌హెచ్‌జీలకు చెల్లించాల్సిన రూ.4051.11కోట్ల వడ్డీని పెండింగ్‌లో పెట్టారని, ఆడబిడ్డలను ఆదుకునే ఉద్దేశంతో.. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1390 కోట్ల వడ్డీ చెల్లించిందని పేర్కొన్నారు.