జనాభాకు తగ్గట్టు అసలు పదవులేవీ?
ABN , Publish Date - Apr 17 , 2026 | 08:04 AM
చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా అంటే.. ఆయా కులాల్లో ఉన్న ఉపకులాలను పరిశీలిస్తే.. ‘కాదు’ అనే సమాధానమే వస్తోంది.
ఎస్సీ, ఎస్టీల్లో చట్టసభల్లో ఉన్నది కొన్ని వర్గాలే
అసెంబ్లీలో 10 మంది మాదిగ, 9 మంది మాల ఎమ్మెల్యేలు
ఎస్టీల్లో లంబాడీ-5, కోయ-5, గోండ్‌లలో ఇద్దరు ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా అంటే.. ఆయా కులాల్లో ఉన్న ఉపకులాలను పరిశీలిస్తే.. ‘కాదు’ అనే సమాధానమే వస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులు ఎస్సీ, ఎస్టీ కులాల్లోని కొన్ని వర్గాల వారికే దక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన (సీపెక్ సర్వే) వివరాలతో పాటు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. సీపెక్ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 61,84,319 (17.43 శాతం) మంది ఉన్నారు. మాదిగలు, మాలలతో పాటు ఈ కులంలో మొత్తం 57 కులాలు (ఉప వర్గాలు) ఉన్నాయి. జనాభా ప్రకారం చూస్తే మాదిగలు 36,54,477 (59.09శాతం) ఉండగా, మాలలు 14,69,463 (23.76 శాతం) మంది ఉన్నారు. మూడో స్థానంలో బేడ (బుడగ), జంగం 1,89,948 (3.07శాతం), నాలుగో స్థానంలో మాలసాలె, నేతకాని వారు 1,70,123 (2.75 శాతం) మంది ఉన్నారు. వీరుకాకుండా మరో 55 కులాల్లో కొంతమేర జనాభా ఉన్నప్పటికీ వారెవరికి చట్ట సభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లభించట్లేదు. కేవలం మాదిగ, మాల, నేతకాని, పంబాల సామాజికవర్గంలో ఉన్నవారిలోనే కొంతమందికి రాజకీయ అవకాశం లభిస్తోంది. గతంలో పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన వెంకటేశ్ నేతకాని వర్గానికి చెందిన వ్యక్తే. రాష్ట్రంలో పంబాల కులం వారు రాష్ట్రంలో 5,751 (0.09శాతం) ఉండగా చెన్నూర్ సెగ్మెంట్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి (రాష్ట్రమంత్రి), బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిగిలిన ఉపకులాల్లో చాలామంది చట్ట సభలకు దూరంగానే ఉంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఎస్సీలకు 19 సెగ్మెంట్లు రిజర్వుడు ఉన్నాయి. వాటిలో 2023 ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం నుంచి 10 మంది, మాల కులానికి చెందినవారు 9 మంది పలు పార్టీల తరపున గెలుపొందారు.
గత ఎన్నికల్లోనూ ఈ రెండు సామాజికవర్గాల వారే అధికంగా ఉన్నారని మాదిగ/మాల కుల సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక ఎస్టీలు 37,05,929 (10.45శాతం) మంది ఉండగా, వారిలో మొత్తం 32 కులాలున్నాయి. పలు ఉపవర్గాలు కూడా ఉన్నా.. వీరిలో కేవలం ఒకటి, రెండు వర్గాల వారికే చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కుతుండడం గమనార్హం. రాష్ట్రంలో ఎస్టీలకు 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. 2023 ఎన్నికల్లో వాటిలో లంబాడీలు ఐదుగురు, కోయలు ఐదుగురు, గోండ్‌ల నుంచి ఇద్దరు చొప్పున వివిధ పార్టీల నుంచి గెలుపొందారు. ఎస్టీల్లోని ఇతర ఉపవర్గాల వారు చట్టసభలకు చాలా దూరంగా ఉన్నారనే విషయాన్ని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీల్లోని ఓ రెండు, మూడు ఉపవర్గాలకు చెందినవారు మాత్రమే చట్టసభలకు వెళ్తుండగా, మిగిలిన వారికి ఆ రకమైన అవకాశాలు రావడంలేదని స్పష్టమవుతోంది.