మెత్తబడ్డ ఎస్‌బీఐ!
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:48 AM
టీహబ్ పక్కన రాయదుర్గం సర్వే నంబరు 83/1లో ఉన్న ఐదు ఎకరాల భూముల వేలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ ఈ వ్యవహారంలో కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వచ్చిన బ్యాంకు
సీఎస్‌తో సీజీఎం ప్రతినిధి బృందం భేటీ.. రాయదుర్గం భూమిపై గడువు కావాలి
కోర్టు వాయిదా దాకా ఏ నిర్ణయం తీసుకోలేం.. లీడ్ బ్యాంకు హోదా తొలగించొద్దని విజ్ఞప్తి
ప్రభుత్వం ఆగ్రహంగా ఉందన్న సీఎస్ రామకృష్ణారావు
భేటీ కాగానే హుటాహుటిన ఢిల్లీకి సీఎస్.. సంప్రదింపుల వివరాలపై సీఎంకు నివేదన
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): టీహబ్ పక్కన రాయదుర్గం సర్వే నంబరు 83/1లో ఉన్న ఐదు ఎకరాల భూముల వేలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎస్‌బీఐ ఈ వ్యవహారంలో కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. భూముల వ్యవహారంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనతో పాటు లావాదేవీలను ఉపసంహరించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకు పునరాలోచనలో పడిందనే అభిప్రాయం సంబంధిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. భూముల విషయంలో వెనక్కి తగ్గిన కారణంగానే సోమవారం బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులకు దిగినట్లు తెలుస్తోంది. రాయదుర్గం భూముల అంశంపై ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం), మరో ఐదుగురు అధికారులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. భేటీలో వివాదానికి కారణమైన భూముల గురించి, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు గురించి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. హైకోర్టులో బ్యాంకు పిటిషన్ దాఖలు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. బ్యాంకు ప్రతినిధుల బృందంతో సమావేశం ముగిసిన వెంటనే సీఎస్ రామకృష్ణారావు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మెట్రో రైలు సమావేశం ముగించుకొని వచ్చిన సీఎం రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు దాదాపు రెండు గంటలపాటు సీఎస్‌తో విడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ ప్రతినిధులతో జరిగిన చర్చ సారాంశాన్ని సీఎస్ ముఖ్యమంత్రికి వివరించారు.
దీనిపై మంగళవారం మరోసారి సీఎం, సీఎస్ సమావేశమై చర్చించే అవకాశం ఉంది. రాయదుర్గంలోని భూము ల విషయంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరుపై కేంద్రానికి, ఆర్‌బీఐకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఆ మేరకు సీఎం ఢిల్లీ వెళ్లిన సమయంలోనే ఎస్‌బీఐ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు రావడం గమనార్హం. సీఎస్‌తో భేటీలో పలు కీలక అంశాల గురించి చర్చించినట్టు తెలిసింది. 2010లో అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించిన తరువాత 2012 వరకు నిర్మాణాలు ఏమీ చేపట్టని కారణంగా అదే ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆ భూముల వ్యవహారం కోర్టు చుట్టూ తిరుగుతోందని సీఎస్ గుర్తు చేశారు. రాయదుర్గంలోని 83/1లోని 5 ఎకరాలకు బదులుగా మరోచోట(ఉస్మాన్‌నగర్, గండిపేట) ఇస్తామన్న ప్రత్యామ్నాయ భూముల అంశంపైనా చర్చించారు. దానిపై తాము ఒక నిర్ణయం తీసుకుంటామని బ్యాంకు ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం. తమ బ్యాంకులో ఉన్న లావాదేవీలను ఉపసంహరించుకోవడం, ఫిక్సి డ్ డిపాజిట్‌లను విత్ డ్రా చేసుకోవడంతో పాటు, లీడ్ బ్యాంకు హోదా నుంచి తొలగించాలన్న ప్రభుత్వం ఉద్దేశంపై పునరాలోచన చేయాలని బ్యాంకు ప్రతినిధులు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇప్పటికే పలు సంస్థలు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాయనీ భేటీలో బ్యాంకు ప్రతినిధులు సీఎస్‌కు చెప్పినట్టు సమాచారం. తమకు ముందుగా కేటాయించిన భూముల విషయంతో పాటు ప్రత్యామ్నా య భూముల అంశంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని వా రు కోరినట్టు తెలిసింది. ఇప్పటికే బ్యాంకు తరపున భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. కోర్టు విచారణ గడువు వరకు బ్యాంకు లావాదేవీలు, విత్ డ్రాల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరినట్టు సమాచారం.