Share News

స్కూల్‌కు వెళ్లిన బాలికల మిస్సింగ్..

ABN , Publish Date - Jul 26 , 2026 | 08:20 AM

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో ఒకేసారి నలుగురు విద్యార్థినులు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలికలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

స్కూల్‌కు వెళ్లిన బాలికల మిస్సింగ్..
Sangareddy Missing Girls

సంగారెడ్డి జిల్లా, జులై 26: జిల్లాలోని ఇస్నాపూర్‌లో నలుగురు విద్యార్థినులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బీహార్‌కు చెందిన ఈ కుటుంబాలు ఉపాధి నిమిత్తం ఇస్నాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన బాలికలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థినులు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మొదట బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.


తల్లిదండ్రులు సంబంధిత ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విచారించగా.. ఆ రోజు ఆ నలుగురు విద్యార్థినులు పాఠశాలకు అసలు హాజరుకాలేదని స్కూల్ సిబ్బంది వెల్లడించారు. దీంతో అనుమానాలు మరింత పెరగడంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, పరిసర ప్రాంతాల సమాచారం సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలికల జాడ తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 26 , 2026 | 09:56 AM