Share News

పంట వద్దు

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:03 AM

రాష్ట్రంలో ప్రస్తుతం సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, సాగునీటి, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

పంట వద్దు
cm revanthreddy

rev2.jpg

  • యాసంగి సాగును వాయిదా వేసుకోవాలి

  • రైతులు పెద్దమనసు చేసుకొని సహకరించాలి

  • ఎల్‌నినోతో కొవిడ్‌ లాంటి సంక్షోభం

  • రాబోయే 8, 10 నెలలు రాష్ట్రంలో గడ్డుకాలం

  • నీటికి, విద్యుత్‌కు తీవ్ర కొరత తప్పదు

  • ప్రస్తుతం ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలి

  • పంటకు మళ్లిస్తే నారుమళ్లకే సరిపోతుంది

  • ఈ నీటిని తాగునీటికే వాడుకుందాం

  • ‘ఎల్‌నినో’పై క్యాబినెట్‌ సబ్‌కమిటీ

  • దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం

  • వచ్చేనెల ఢిల్లీకి అఖిలపక్ష బృందం: రేవంత్‌

  • మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం సూపర్‌ ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, సాగునీటి, తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పెద్దమనసు చేసుకుని యాసంగిలో పంట వేయకుండా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే 8, 10 నెలల కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉపశమన చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. గురువారం అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులపై సుదర్ఘీంగా చర్చించారు.


అనంతరం పలువురు మంత్రులతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో ఎండ వేడిమి వంటి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తు వాళ్లు ఊహించినట్లుగానే పరిస్థితులు చేయిదాటి పోతున్నాయి. 2019-20లో కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది. అలాంటి సంక్షోభాన్ని ఈ రోజు ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, ప్రజలను, జీవరాశులను కాపాడడానికి అందుబాటులో ఉన్న మంత్రులందరినీ పిలిపించి, చర్చించడం జరిగింది. వివిధ శాఖల కార్యదర్శులతో కూడా చర్చించి కొంత కార్యాచరణను రూపొందించాం’’ అని సీఎం వివరించారు. ‘‘ఈరోజు ఒక ప్రకృతి విపత్తును ఎదుర్కొనబోతున్నాం. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. సాగునీరు, తాగునీరు లేకపోవడం, పరోక్షంగా విద్యుత్తు వినియోగం పెరగడం, విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది పరిశ్రమలు, ప్రజా జీవితం, దినసరి కార్యక్రమాలపై తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. అందుకే వర్షాకాల పంటల సందర్భంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశాం. వర్షాధార పంటలను తక్కువగా వేయాలని చెప్పాం. మేము చెప్పడం వల్ల 13 లక్షల ఎకరాల్లో వరి పంటను వేయకుండా ఇతర పంటల వైపు రైతులు మళ్లారు. అయినా... 56 లక్షల వరకు వరిని పండించారు. నిజానికి అక్టోబరులో రోజుకు 15 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండాలి. కానీ... అది 20 వేల మెగావాట్లకు పెరిగింది. ఎండాకాలంలో ఉండాల్సిన ఎండలు అక్టోబరులో ప్రభావం చూపాయి. అయినా 23వేల మెగావాట్ల డిమాండ్‌ ఉన్నా, అవసరమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంలో 6-7వేల మెగావాట్ల డిమాండ్‌ ఉండేది. ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్లు అదనంగా పెరిగింది. అయినా... విద్యుత్తుశాఖ సమర్థంగా పని చేసి విద్యుత్తును అందించడానికి కృషిచేస్తోంది’’అని సీఎం అన్నారు.


మార్కెట్‌లో విద్యుత్‌ దొరకడంలేదు..

చేతికి వచ్చే పంట ఎండిపోకూడదని, విద్యుత్‌ను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘‘రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రూ.14-15లకు యూనిట్‌ విద్యుత్తును కొనుగోలు చేస్తోందని, మనం ఎంత చెల్లించి కొందామన్నా.. మార్కెట్‌లో విద్యుత్తు దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరినీ ఆదుకోవడానికి, పంటలు దెబ్బతినకుండా ఉండడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘‘కృష్ణా బేసిన్‌లో ఈ సంవత్సరం 72 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 40 శాతం తక్కువగా ఉంది. వర్షపాతం 23 శాతం తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి. ఏ రిజర్వాయర్లలో కూడా నీరు లేక, వట్టిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. 24 వేల గ్రామాలకు తాగునీటిని అందించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలను అప్రమత్తం చేసి, కేంద్రం నుంచి ఎలా సహకారం తీసుకోవాలో సమీక్షించాం. ప్రస్తుత పంటకు సంబంధించి 11, 12 లక్షల ఎకరాలకు ఇబ్బందిగా ఉంది. ఒక్క ఎకరా ఎండిపోకుండా ఉండడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. గ్రేటర్‌ హైదరాబాద్‌కు వచ్చే సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నీటిని పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించాం. సాగుకు నీటిని తగ్గించుకుంటూ.. వచ్చే 8-10 నెలలు గడపాలి. గతేడాది ఇదే కాలం నాటికి 462 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఈసారి 209 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ నీరు నారుమళ్లకే సరిపోతుంది. ఆ తర్వాత పంటకు ఇవ్వలేం. తాగునీటికి సమస్య తలెత్తుతుంది. అందుకే రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సీఎం అన్నారు.


నీళ్లను కొనుక్కోలేం..

అందుబాటులో ఉన్న 209 టీఎంసీలను పొదుపుగా వాడుకోవాలని, కేవలం తాగునీటి కోసమే వినియోగించాలని సీఎంసూచించారు. ఎవరి తప్పుడు ప్రచారాలనైనా నమ్మి వరి పంటను వేస్తే.. పెట్టుబడి నష్టపోతారని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పేలిపోయే అవకాశం ఉందన్నారు. కూలీలకు పని దొరికే అవకాశం ఉండదని, అందుకే ఉపాధి హామీ ద్వారా పూర్తి స్థాయి పనులను చేపట్టాలని అధికారులకు చెప్పామన్నారు. ‘‘భూమి ఉన్న రైతులకు ఇప్పటి పంటకుగాని, రేపు వేసుకోవాల్సిన పంటకు సంబంధించి కేంద్రం సహకరించాలి. కేంద్ర సౌజన్య పథకాల కింద 60శాతం నిధులను కేటాయించాలి. ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘం త్వరలోనే అఖిలపక్షాన్ని పిలిచి భేటీ అవుతుంది’’ అని సీఎం వివరించారు.

మంత్రులతో సమావేశంలో

తీసుకున్న నిర్ణయాలు

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.

ఎల్‌నినో ప్రభావిత సమాచారాన్ని అందించడానికి మీడియా కోసం ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావును నోడల్‌ అధికారిగా నియమిస్తున్నాం. టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఇస్తాం. మీడియా అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలకు చేరవేయాలి.

దసరా పండుగ తర్వాత భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. రాజకీయ పార్టీలతోపాటు సంఘాలు, కార్మిక సంఘాలను పిలిపించి సమస్యలపై చర్చిస్తాం. కార్యాచరణ రూపొందిస్తాం.

ముఖ్యమంత్రి నేతృత్వంలో నవంబరు మొదటి వారంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ప్రధాని, విప్తుల నిర్వహణ సంస్థ చైర్మన్‌ అయిన హోంమంత్రిని కలుస్తాం.

ప్రజలను అప్రమత్తం చేయడానికి కళాజాత బృందాలు గ్రామాల్లో పర్యటిస్తాయి. నిపుణులను కూడా పత్రికలలో వార్తలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సినీ ప్రముఖులతో ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. విజయ్‌ దేవరకొండ ఇలాంటి అప్పీల్‌ చేశారు. మరింత మంది సినీ ప్రముఖులు ప్రజలకు పిలుపునివ్వాలి.


విద్యుత్తు సంక్షోభం...

ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం నమోదవుతోందని, ఇది ఆషామాషీ వ్యవహారం కాదని సీఎం రేవంత్‌ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం, పైశాచిక ఆనందం పొందేవాళ్లకు ఇది కనపడదని వ్యాఖ్యానించారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కేంద్ర ప్రభుత్వ సహకరించాలని, రాష్ట్రానికి అదనంగా విద్యుత్తును అందించాలని కోరాలని నిర్ణయించామన్నారు. ‘‘కొంత తక్కువ ధరకు విద్యుత్‌ ఇవ్వాలి. రైతులకు అవసరమైన విద్యుత్తును కొనుగోలు చేసి, ప్రతి వ్యక్తి అవసరాలను తీర్చాలని అనుకుంటున్నాం. కేంద్రానికి నిధులు చెల్లించైనా విద్యుత్తును తీసుకోవాలని నిర్ణయించాం. కొవిడ్‌ సందర్భంగా ప్రధానమంత్రి గుళ్లలో గంటలు కొట్టాలన్నా, వీధిలో పళ్లాలు కొట్టాలన్నా కొట్టాం. ఆ రోజు పార్టీలు అని చూడలేదు. ఈరోజు రాజకీయ పార్టీలు అదే స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కొనడానికి నిలబడాలి’’ అని అన్నారు. పశు సంపదను జాగ్రత్తగా కాపాడుకోవాలని, పశుగ్రాసం, తాగునీటి కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అధికారులు నూటికి నూరు శాతం ప్రయత్నించడంతోపాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కేంద్రం సహకరించాలని అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

Updated Date - Oct 16 , 2026 | 02:05 AM