Share News

‘కాళేశ్వరం’ను గాలికొదిలేయందోషులనూ వదలం!

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:01 AM

‘కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోం. ఎన్డీఎ్‌సఏ సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం. ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం. మళ్లీ వినియోగంలోకి తెస్తాం. లక్ష కోట్లు పెట్టిన.....

‘కాళేశ్వరం’ను గాలికొదిలేయందోషులనూ వదలం!

  • ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు.. లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకూ నీళ్లివ్వలేదు

  • కేసీఆర్‌ హయాంలోనే లీకేజీలు, కుంగుబాటు కూడా

  • మేడిగడ్డ వద్ద మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, వరంగల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును గాలికి వదిలేయబోం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం. ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం. మళ్లీ వినియోగంలోకి తెస్తాం. లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్టును గాలికి వదిలే ప్రసక్తి లేదు. అదే సమయంలో, ప్రాజెక్టులో అవినీతికి కారకులైన దోషులనూ వదిలిపెట్టేది లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిపై వెనువెంటనే సీబీఐ విచారణ చేయకపోతే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళతామని కేంద్రానికి తాము లేఖ రాశామని, దాంతో, సీబీఐ విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే హరీశ్‌ రావు, వినోద్‌కుమార్‌ హుటాహుటిన, రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కడ ఎవరెవరిని కలిశారు.. ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారనే వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయవాదులతో చర్చించడానికి వెళ్లామని చెబుతున్నారని, ఆ తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసిందని, ఇంకా తీర్పు వెలువడలేదని, తీర్పు వెలువడకుండా కేసు ఏముందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు జరుగుతున్న పరీక్షలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎన్‌డీఎస్ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌, సమన్వయ కమిటీ చైర్మన్‌ కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాతో కలిసి సోమవారం సీఎం రేవంత్‌ పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని తప్పుబట్టారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో ఆర్థికంగా, రాజకీయంగా తమకు ఉపయోగం లేదనే రీడిజైనింగ్‌ పేరిట అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ‘‘కేంద్రం నుంచి మంత్రులు ఎవరొచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఆ కేసును అప్పగిస్తే 48 గంటల్లో విచార ణ చేస్తామని, కేసీఆర్‌, హరీశ్‌ రావును అరెస్ట్‌ చేస్తామని ప్రకటించేవారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా.. మీవల్ల కాదు.. మీకు విచారణ చేసే సామర్థ్యం లేదు.

2 - Copy.jpg


మాకు అప్పగిస్తే 48 గంటల్లో అరెస్టు చేస్తామని అన్నారు. ఈ కేసును కేంద్రానికి అప్పగించి 9 నెలలైనా ఎందుకు స్పందిస్తలేరు? పదే పదే లేఖలు రాసినా ఎందుకు స్పందిస్తలేరు? వేల కోట్లు కొల్లగొట్టారని మీరే ఆరోపించి.. ఎందుకు చర్యలు తీసుకుంటలేదు!?’’ అని బీజేపీని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ 645 పేజీల నివేదికను ఇచ్చిందని, కేసీఆర్‌, హరీశ్‌ సహా 119 మంది అధికారులను బాధ్యులను చేసిందని, ఈ కేసులో వివిధ ఏజెన్సీలు, వివిధ రాష్ట్రాలు, వివిధ ఆర్థిక సంస్థల పాత్ర ఉందని, రాష్ట్ర సంస్థలు అయితే సంపూర్ణ విచారణ జరగదని సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని, 9 నెలలు కావస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దాంతో, విచారణ చేయాలంటూ ఇటీవలే మళ్లీ లేఖ రాశామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే, సీబీఐ విచారణను అడ్డుకోవడానికే హరీశ్‌, వినోద్‌ కుమార్‌ ఢి ల్లీకి వెళ్లారని, రహస్యంగా ఆర్‌ఎ్‌సఎ్‌సను కలిసి.. సీబీఐ విచారణ ప్రారంభించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ, కేసుల కోసమే ఢిల్లీ వెళ్లి ఉంటే ముందుగా ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మీడియా కనిపెట్టి.. ప్రకటన చేయడంతో కేసుల కోసం పోయినట్లు కథలు అల్లుతున్నారని ఆరోపించారు. నిజానికి, బీజేపీని ప్రసన్నం చేసుకొని సీబీఐ విచారణ జరపకుండా అడ్డుకోవడానికి వెళ్లారని మండిపడ్డారు. ఈ కేసులో బీజేపీ ప్రభుత్వంపై నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని హరీశ్‌ రావు ప్రశ్నిస్తున్నారని, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అన్నింటికీ ప్రాణవాయువని, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ వల్లే వరి దిగుబడి వస్తోందని వివరించారు.


కేసీఆర్‌ అవినీతిని ప్రకృతే బయటపెట్టింది

కేసీఆర్‌ అహంకారాన్ని, అవినీతిని, దుర్మారమైన ఆలోచనను ప్రకృతి గుర్తించి బయటపెట్టిందని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ప్రచారార్భాటాలకు ఈ ప్రాజెక్టును వాడుకుని 2018లో అధికారంలోకి వచ్చారు. 2020లోనే లీకేజీ విషయాన్ని అధికారులు సూచించారు. దానిని పట్టించుకోలేదు. 2023లో మళ్లీ అదే ఆర్భాటం చేసి గద్దెనెక్కాలని ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ అవినీతిని, అహంకారాన్ని ప్రకృతి గుర్తించి, ప్రకోపించడంతో మేడిగడ్డ కుంగిపోయింది. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ప్రమాదమని కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే ఎన్డీఎ్‌సఏ స్పష్టం చేసింది. దానిపై ఎదురు దాడి చేశారు తప్పితే దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు’’ అని వివరించారు. అప్పట్లో తాను, శ్రీధర్‌బాబు, రాహుల్‌ గాంధీ ఇక్కడికి వచ్చి అవినీతిని ప్రపంచానికి చెప్పడం జరిగిందన్నారు.

నెల రోజుల ముందే డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాం

కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 20న సందర్శించాలని నెల రోజుల ముందే తేదీని ఫిక్స్‌ చేసుకున్నామని, ఈ పర్యటనలో తమ బండారం, దోపిడీ బయటపడుతుందని గుర్తించి జగిత్యాలలో ఇదే రోజు సమావేశం పెట్టుకున్నారని మండిపడ్డారు. అతి తెలివితేటలతో ఆ సమావేశం పెట్టుకున్నారని విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్‌ సభ నేపథ్యంలో.. దానికి భయపడి సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు ఆయన జవాబిచ్చారు.

జగిత్యాల సభకు, కాళేశ్వరం టూర్‌కు సంబంధం లేదు: మంత్రి ఉత్తమ్‌

జగిత్యాల సభకు, తమ కాళేళ్వరం పర్యటనకు సంబంధం లేదని, మేడిగడ్డలో పర్యటించాలని నెల రోజుల కిందటే నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజె క్టు స్వతంత్ర భారతదేశంలో మనిషి సృష్టించిన విపత్తు అని, మానవ తప్పిదంతో ఇంత నష్టం మరెక్కడా జరగలేదని చెప్పారు. కమీషన్ల కక్కుర్తి, అవగాహన లోపంతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమే పెద్ద తప్పిదమన్నారు. మూడు, నాలుగు రెట్లకు అంచనాలు పెంచడం, రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.40 లక్షల కోట్లకు చేర్చారని మండిపడ్డారు. రాబోయే తరాలను తాకట్టు పెట్టి, అత్యధిక వడ్డీతో లోన్లు తెచ్చి... అసమర్థత, అవినీతితో ప్రాజెక్టు కడితే అది కాస్తా కుంగిపోయిందని మండిపడ్డారు.

Updated Date - Apr 21 , 2026 | 04:01 AM