రెండు ఎమ్మెల్సీలూ గెలవాల్సిందే
ABN , Publish Date - Oct 14 , 2026 | 04:06 AM
తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాజకీయాల్లో సెకండ్ ప్రైజ్ ఉండదు.. తేలికగా తీసుకోవద్దు
75 శాతం తెలంగాణను కవర్ చేసే కీలక పోరు
రాబోయే ఎమ్మెల్సీలు ఇతర సామాజిక వర్గాలకు
కేయూ విద్యార్థి నేతకు కార్పొరేషన్ పదవి
ప్రజాప్రతినిధులు, డీసీసీ చీఫ్‌లతో భేటీలో రేవంత్
హైదరాబాద్‌కు తిరిగొచ్చిన సీఎం, కాంగ్రెస్ నేతలు
రాజకీయాల్లో సెకండ్ ప్రైజ్ ఉండదు .. తేలికగా తీసుకోవద్దు.. గెలుపే లక్ష్యం కావాలి
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పుట్టినిల్లు
రెండు సీట్లనూ రెడ్లకే ఇచ్చామనుకోవద్దు
మిగిలినవి ఇతర సామాజిక వర్గాలకు
ప్రజాప్రతినిధులు, డీసీసీ చీఫ్‌లతో భేటీలో సీఎం రేవంత్
న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో గెలుపే ప్రామాణికమని, ఇక్కడ సెకండ్ ప్రైజ్ ఉండదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నేతల పనితీరుపై ఆధారపడే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని, నిర్లక్ష్యం వహిస్తే రాజకీయ జీవితం ముగిసినట్లేనని హెచ్చరించారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. నాయకులు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ ఎన్నికలు దాదాపు 75 శాతం తెలంగాణను కవర్ చేసే అత్యంత కీలకమైన పోరు అని పేర్కొన్నారు. ఎన్నికల బాధ్యతలను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు సమన్వయంతో భుజానికెత్తుకోవాలన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఒకే సామాజిక వర్గానికి కేటాయించారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పుట్టినిల్లు అని చెప్పారు. గతంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు, పార్టీ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో ఎంత పారదర్శకంగా వ్యవహరించామో, సామాజిక సమతుల్యతను ఏ విధంగా పాటించామో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ స్థానాలను మిగిలిన సామాజిక వర్గాలకు కేటాయించి ఈ లోటును భర్తీచేస్తామన్నారు. కాకతీయ వర్సిటీ విద్యార్థి నేతకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని ప్రకటించారు.
దసరాలోపు కమిటీలు వేయాలి..
ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, దసరా పండుగలోపు గ్రౌండ్‌వర్క్ అంతా పూర్తిచేసి కమిటీలను నియమించాలని పార్టీ నేతలను సీఎం రేవంత్ ఆదేశించారు. మండల స్థాయిలో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీలు వేయాలని, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో కూడిన కమిటీ జిల్లా స్థాయి బాధ్యతలను పర్యవేక్షించాలని సూచించారు. కమిటీల్లో నియమించే ప్రతి సభ్యుడికీ తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై తాను సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. పీఆర్‌సీ ఏర్పాటు సహా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చేసిన మేలును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులను భాగస్వామ్యులను చేస్తూ ప్రచారాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 శాతం, మున్సిపాలిటీల్లో 80 శాతానికి పైగా స్థానాలు సాధించిన ఉత్సాహంతో ఈ రెండు ఎమ్మెల్సీల్లోనూ జయకేతనం ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
నేతలంతా తిరుగు ప్రయాణం
ఇండియా కూటమి ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. కొందరు నేతలు ఖర్గేను కలిశారు. నేతలు తమ తమ రాష్ట్రాలకు వెళ్లవలసిందిగా ఏఐసీసీ సూచించడంతో నేతలంతా రాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. సీఎం రేవంత్ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్‌ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక