Share News

ప్రతిభే ప్రామాణికం

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:40 AM

డీసీసీ అధ్యక్ష పదవి అధికారం కాదని, అదొక బాధ్యతని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఒక పదవి రాగానే గాంధీభవన్‌ చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే మరిన్ని పదవులు వస్తాయని...

ప్రతిభే ప్రామాణికం

  • కాంగ్రెస్‌లో ఏ లిస్టులూ ఉండవు..ఉండేది ఒక్క మెరిట్‌ లిస్టే

  • కష్టపడే వారికే పదవులు

  • గాంధీల కుటుంబంపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

  • సర్కార్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

  • తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు ప్రారంభం

3 తరాల ప్రాణత్యాగాలు

మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలిచ్చారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ- నెహ్రూ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తోంది. సోనియా, రాహుల్‌లపై తప్పుడు కేసులు పెట్టి అవమానిస్తోంది.

- సీఎం రేవంత్‌రెడ్డి

వికారాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): డీసీసీ అధ్యక్ష పదవి అధికారం కాదని, అదొక బాధ్యతని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఒక పదవి రాగానే గాంధీభవన్‌ చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే మరిన్ని పదవులు వస్తాయని చాలా మంది భావిస్తున్నారని ప్రస్తావించారు. నాయకుల ఇళ్ల దగ్గర పడిగాపులు కాసేవారికి కాకుండా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేవారికే ప్రాధాన్యం ఇస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏ నాయకుడికి దగ్గర ప్రత్యేక లిస్టులు ఉండవని, కేవలం మెరిట్‌ లిస్ట్‌ మాత్రమే ప్రామాణికం అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కష్టపడే వారికి కచ్చితంగా న్యాయం జరగుతుందని భరోసా ఇచ్చారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) అధ్యక్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. పైరవీలకు దూరంగా ఉన్నప్పుడే నాయకులకు గౌరవం పెరుగుతుందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అనుబంధ విభాగాల్లో కష్టపడిన వారికి కార్పొరేషన్‌ పదవులు కట్టబెట్టామన్నారు. కాంగ్రెస్‌లో మెరిట్‌ కోటా తప్ప ఏ కోటా ఉండదని అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసి, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు అని నేతలను హెచ్చరించారు.


డీసీసీ నుంచి పీసీసీ అధ్యక్షులు కావచ్చని, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కావొచ్చని గుర్తు చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం పైరవీల జోలికి పోలేదని చెప్పారు. 16 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగానని, కేవలం తన పనిని పార్టీ గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌ బలోపేతం కావాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాకు అధిపతులమని భావించి కార్యకర్తలను, తమను వ్యతిరేకించే వారికి తొక్కేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన కొత్తలో తనపై ఎంతో వ్యతిరేకత ఉన్నా పార్టీలో ఉన్న ప్రతీ నాయకుడి ఇంటికి వెళ్లి తన ఆలోచన చెప్పి అందరినీ అందరినీ ఒప్పించానన్నారు. అందరం కలిసి కృషి చేయడం వల్లే ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. ఆ సమన్వయం వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ప్రత్యర్థి పార్టీకి మధ్య తేడా కేవలం రెండు శాతమని, అది లోక్‌సభ ఎన్నికలకు నాలుగు శాతానికి, మునిసిపల్‌ ఎన్నికల్లో 12 శాతానికి పెరిగిందని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల్లో ఉన్న విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం నుంచి 42 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలను నమోదు చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టడం, ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 49.83 శాతం, మున్సిపల్‌ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలకు అవకాశం కల్పించడం కాంగ్రెస్‌ సాధించిన విజయాలని ప్రస్తావించారు. వైఎస్‌ షర్మిల తండ్రి వారసత్వంగా పదవులు పొందే అవకాశం ఉన్నా 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరూపించుకున్న తర్వాత పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ కోసం నిబద్దతతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు.


గాంధీ కుటుంబంపై కుట్రలను తిప్పికొట్టాలి

దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ కుటుంబంపై బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ తెచ్చిన స్వాతంత్ర్యాన్ని, కాంగ్రెస్‌ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని పుట్టిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అని మాట్లాడటం అత్యంత విచారకరమన్నారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాఽణాలిచ్చారని, రాజీవ్‌గాంధీ ఆశయాల సాధన కోసం సోనియాగాంధీ సర్వం త్యాగం చేసి కాంగ్రె్‌సకు అండగా నిలిచారని రేవంత్‌రెడ్డి కొనియాడారు. కష్టం తెలియకుండా పదవులు పొందే అవకాశం ఉన్నా రాహుల్‌గాంధీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ప్రస్తావించారు. గాంధీ-నెహ్రూ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తోందని, పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీని మాట్లాడనివ్వడం లేదని, సోనియా, రాహుల్‌పైన తప్పుడు కేసులు పెట్టి అవమానిస్తోందని చెప్పారు. మూడు తరాలు ప్రాణత్యాగం చేసిన గాంధీ-నెహ్రూ కుటుంబానికి డబ్బులు అవసరమా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవడానికే బీజేపీ కుట్రలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతోందన్నారు. దళితులు, మైనార్టీలు, పేదల గొంతు నొక్కడానికి జరుగుతున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌ కార్యకర్తలే అడ్డుకోవాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. పది రోజుల పాటు జరిగే ప్రత్యేక శిక్షణా శిబిరం మొదటి రోజు కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


నడుం బిగించాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌

కాంగ్రెస్‌ను బూత్‌ స్థాయి నుంచి తిరుగులేని శక్తిగా మార్చేందుకు డీసీసీ అధ్యక్షులు నడుం బిగించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని నరనరాన ఎక్కించుకోవాలన్నారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో శనివారం ప్రారంభమైన సంఘటన్‌ సృజన్‌ శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన నాయకత్వాన్ని త యారు చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఇది దేశవ్యాప్త మార్పునకు దోహదపడుతుందని చెప్పారు. ‘కాంగ్రె్‌సలో నిరంతరం నేర్చుకోవడం అవసరం. ఎన్‌ఎ్‌సయూఐ స్థాయి నుంచి వచ్చిన నాకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం దక్కడం కేవలం కాంగ్రెస్‌లోనే సాధ్యం. ఇది త్యాగధనులకు కేరాఫ్‌ అడ్రస్‌’ అని కొనియాడారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రుల సహకారంతో నేడు రాష్ట్రం అభివృద్ధి వైపు సాగుతోందని చెప్పారు. మునిసిపల్‌ ఎన్నికల్లో 90శాతం, పంచాయతీ ఎన్నికల్లో 75 శాతానికిపైగా స్థానాల్లో కాంగ్రెస్‌ గెలవడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ బలం పెరిగింది!

భూసేకరణే ప్రధాన అడ్డంకి

Updated Date - Feb 22 , 2026 | 07:10 AM