బీజేపీ బలం పెరిగింది!
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:03 AM
‘‘బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో ఎంపీ తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించకపోగా..
బీఆర్‌ఎస్ బలం క్షీణిస్తోంది.. కాంగ్రెస్ పట్టు అంత బలంగా లేదు
కొందరు ఎంపీలు ప్రత్యర్థులతో చేతులు కలిపారు
జాతీయ నాయకత్వానికి రాంచందర్‌రావు నివేదిక
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో ఎంపీ తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించకపోగా.. ఇంకో ఎంపీ కష్టపడి పనిచేస్తున్న మునిసిపాలిటీలో బీఆర్‌ఎస్ గెలుపు కోసం పని చేశారు. కొంతమంది ఎంపీలు అసలు మునిసిపల్ ఎన్నికలను సీరియ్‌సగానే తీసుకోలేదు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కవడంతో కేవలం మూడు ఓట్ల తేడాతో మేయర్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. మునిసిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం 13 నుంచి 15కు పెరిగింది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ పట్టు క్రమంగా కోల్పోతున్నప్పటికీ.. ఆ మేరకు కాంగ్రెస్ పట్టు బలంగా బిగించలేకపోతోందని, ఈ రీత్యా బీజేపీ బలోపేతం కావడానికి ఇదే సువర్ణావకాశమని నివేదికలో రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఓట్ల శాతం కోల్పోయినంత మేరకు కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదని తెలిపారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 70 సంస్థల్నే కాంగ్రెస్ గెలుచుకుందంటే 44 శాతం పట్టణ తెలంగాణ.. ఆ పార్టీని ఆదరించలేదని ఆయన విశ్లేషించారు. అయితే పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సీరియ్‌సగా తీసుకుని అంతా ఏకతాటిపై పనిచేసేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వస్తాయని, అయినప్పటికీ బీజేపీ తన పట్టణ పునాదిని బలోపేతం చేసుకుందని పేర్కొన్నారు.
నిర్ణాయక శక్తిగా ఎదిగాం..
రాంచందర్‌రావు నివేదిక ప్రకారం.. 2020లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ 240 వార్డుల్లో గెలుపొందగా, ఈ ఎన్నికల్లో 340 వార్డులను సాధించుకోగలిగింది. 2020లో రెండు మునిసిపాలిటీల్లోనే ఏకైక అతిపెద్ద పార్టీగా నిలవగా, ఈసారి 35కు పైగా మునిసిపాలిటీల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా, ఎన్నికల అనంతరం నిర్ణాయక శక్తిగా ఎదిగిందని ఆయన తెలిపారు. ఆదిలాబాద్, నారాయణపేట, రాయికల్, అమరచింత, ఖానాపూర్ మునిసిపాలిటీల్లో ఇతరులు మద్దతిస్తే కౌన్సిళ్లు ఏర్పాటు చేయగలిగే శక్తి పొందిందని పేర్కొన్నారు. 80కి పైగా వార్డుల్లో 5శాతం లోపు తేడాతోనే బీజేపీ ఓడిపోయిందని, 30 వార్డుల్లో కేవలం 2శాతం తేడాతో ఓడిందని వివరించారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, మెట్‌పల్లి, కామారెడ్డి, రాయికల్‌లో బీజేపీ బలమైన పనితీరు ప్రదర్శించిందని తెలిపారు. తూర్పు తెలంగాణలో మొదటిసారి పార్టీ సంస్థాగతంగా చొచ్చుకుపోయిందని, కొత్తగూడెం, అశ్వరావుపేట, పరకాలలో ఈ ప్రభావం బాగా కనిపించిందని పేర్కొన్నారు. దక్షిణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎన్నికల అనంతరం ఒక నిర్ణాయక శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. అర్బన్ తెలంగాణలో బీఆర్‌ఎస్ నిర్మాణాత్మకంగా క్షీణించిందని రాంచందర్‌రావు నివేదికలో పేర్కొన్నారు. 2020 ఎన్నికల్లో ఆ పార్టీకి 43 శాతం ఓట్లు రాగా, ఈసారి 19 శాతానికి పడిపోయాయని తెలిపారు. వార్డుల రీత్యా చూసినా బీఆర్‌ఎస్ గతంతో పోలిస్తే 550 వార్డులను కోల్పోయిందన్నారు. కేవలం 13 మునిసిపాలిటీల్లోనే ఆ పార్టీ గెలుపు పరిమితమైందని రాంచందర్‌రావు వివరించినట్లు తెలిసింది.