Share News

భూసేకరణే ప్రధాన అడ్డంకి

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:06 AM

ఏడాదంతా 60 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి ఐదున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది.

భూసేకరణే ప్రధాన అడ్డంకి

  • ఏళ్లుగా సాగుతున్న దేవాదుల నిర్మాణం

  • నాలుగు రెట్లు పెరిగిన అంచనా వ్యయం

  • నేడు ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం

వరంగల్‌, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏడాదంతా 60 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి ఐదున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. 2004-05లో ప్రారంభమైన దేవాదులు 2011లో పూర్తి కావాల్సి ఉంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులు పూర్తయినప్పటికీ కీలకమైన పేజ్‌-3లో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాంగ్రె స్‌ ప్రభుత్వం ప్రాధాన్యప్రాజెక్టుల జాబితాలో చేర్చి 2027 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనిలక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదిన్నర కాలంగా మంత్రులు పర్యటనలు, సమీక్షలతో గడిచిపోయింది. తాజాగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లా కన్నాయిగూడెం గోదావరి తీరాన ఉన్న దేవాదుల ప్రాజెక్టును సందర్శించడానికి వస్తుండటంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మూడో దశ పూర్తి చేస్తే మరో మూడు లక్షల ఎకరాలకు పైగా నీరు అందే అవకాశం ఉంది. మూడో దశకు కావాల్సిన 2,869 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అత్యధికంగా జనగామ జిల్లాలో1,068 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 935 ఎకరాలు, వరంగల్‌ జిల్లాలో 354 ఎకరాల భూమిని సేకరించాలి. పదేళ్లలో భూముల ధరలు విపరీతంగా పెరగటంతో రైతు లు పరిహారాన్ని ఎక్కువగా డిమాండ్‌ చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు రూ.4,400 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. 2005-06లో టెండర్లు పిలిచే నాటికి రూ.6,016 కోట్లకు చేరింది. పనుల్లో జాప్యం, నిధుల విడుదల చేయక పోవటం వల్ల నత్తనడకన సాగింది. 2016-17 నాటికి అంచనాలు రూ.13,445 కోట్లకు చేరాయి. 2020 జూన్‌ నాటికే 14,729 కోట్లకు చేరగా, రూ.14,188 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.3,312కోట్లు అవసరమని తేల్చారు. అంటే, రూ.17,500 కోట్లు. పూర్తయ్యే నాటికి మరింత పెరి గే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలతో కలిసి ఆదివారం మధ్యా హ్నం 3.30 గంటలకు దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీలను ఏరియల్‌ సర్వే చేయనున్నారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టు ఇంనీరింగ్‌ అధికారులతో సమీక్షించనున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 07:07 AM