Share News

అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు

ABN , Publish Date - Jun 07 , 2026 | 06:15 AM

బీఆర్‌ఎస్‌ వాళ్లు కోహెడ ఫ్రూట్‌ మార్కెట్‌ కట్టొద్దని అంటున్నారు. భారత్‌ ప్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న అష్టదరిద్రులు

  • ఫ్యూచర్‌ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్టులు ఏవీ అక్కర్లేదట.. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు

  • అభివృద్ధి నిరోధకులకు విపక్ష హోదా ఉండదు

  • మూడేళ్లలో చుక్క నీరు కాళేశ్వరం నుంచి రాకపోయినా అత్యధిక వరి పండిస్తున్నాం

  • హరీశ్‌.. నీ దిక్కుమాలిన సలహాలు మాకొద్దు

  • కోహెడ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌ వాళ్లు కోహెడ ఫ్రూట్‌ మార్కెట్‌ కట్టొద్దని అంటున్నారు. భారత్‌ ప్యూచర్‌ సిటీని రద్దు చేస్తామంటున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు. రీజనల్‌ రింగ్‌ రైల్వే లైన్‌ అవసరం లేదంటారు. వరంగల్‌, అదిలాబాదుల్లో ఎయిర్‌ పోర్టులు అక్కర్లేదంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామంటే వీల్లేదంటారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదంటారు. ఆనాడు మేం ఫ్రూట్‌ మార్కెట్‌ కట్టాలని, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు తరలించాలని, రీజినల్‌ రింగ్‌ రోడ్డు కావాలని చెప్పాం. అభివృద్ధి చేయాలని అప్పట్లో మేం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు అభివృద్ధిని అడ్డుకుంటామని రోడ్లమీద కొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు’’ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఉండదని, కారు చెడి కార్ఖానాకు చేరుతుందని, దానిని కూడా ఫామ్‌ హౌస్‌లో టైర్లు లేకుండా రాళ్లపై నిలబెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన కోహెడలో పండ్ల మార్కెట్‌తోపాటు ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కాంప్లెక్స్‌ పనుల ప్రారంభానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి సభలో పాల్గొని మాట్లాడారు. ఫ్రూట్‌ మార్కెట్‌ కోసం తాము చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఐటీ కంపెనీలతో పలు ప్రముఖ దిగ్గజ కంపెనీలు రావడంతో భూముల విలువ పెరిగి అక్కడ ఎకరం రూ.237 కోట్లు పలికిందని, అందుకే భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మించి ఫార్చ్యూన్‌ 500 కంపెనీలను, ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన, కాలుష్యం లేని కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నామని తెలిపారు.


దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపోయే విధ్వంసం

దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపోయే విధ్వంసం చేశారని, రూ.8 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ విశ్వాసంతో 24 గంటలు కష్టపడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు. దేశ ఉత్పత్తిలో 60ు తెలంగాణ నుంచి ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపామన్నారు. ఎవరు అడ్డంపడ్డా అభివృద్ధి ఆపేది లేదని తేల్చిచెప్పారు. ‘‘అసూయ, పగ, ద్వేషం మాపైన చూపించాలి. కానీ, తెలంగాణ ప్రజలపైన కాదు. ఫామ్‌హౌజ్‌లో పడుకున్న కేడీతోనైనా, ఢిల్లీలో ఉన్న మోదీతోనైనా కొట్లాడుతా. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను అల్లాటప్పగా రాలేదు. తొక్కుకుంటే అధికారంలోకి వచ్చాను’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనలేని మోదీ గద్దె దిగాలని, రాహుల్‌గాంధీని ప్రధానిని చేసి ప్రతీ గింజ కేంద్రంతో కొనిపిస్తానని అన్నారు. మెట్రో విస్తరణకు అనుమతులు తీసుకువస్తామని, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకు వస్తామని తెలిపారు. ‘‘75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్న తర్వాత కేంద్రం సంగతి చూస్తా. మెట్రో విస్తరణకు అనుమతులు.. ఆదిలాబాద్‌, వరంగల్‌ ఎయిర్‌ పోర్టుకు నిధులు ఎలా ఇవ్వరో చూస్తా. కిషన్‌రెడ్డి.. పొలిమేరలు కూడా దాటవు’’ అంటూ హెచ్చరించారు.మోదీ ప్రభుత్వం ఉందని భయపెట్టాలనిచూస్తే భయపడబోమని అన్నారు.

డిసెంబరు నుంచి అందుబాటులోకి అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్‌ మార్కెట్‌

అంతర్జాతీయ స్థాయిలో ప్రూట్‌ మార్కెట్‌ను తీర్చిదిద్దుతామని, డిసెంబర్‌ నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడతామని సీఎం రేవంత్‌ అన్నారు. 60 శాతం ఆదాయం రంగారెడ్డి జిల్లా నుంచే వస్తోందని, ఆ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆనాటి ప్రభుత్వం కొత్తపేటలోని పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించిందని, టెంట్లేసి రేకులేస్తే గాలి దుమారానికి లేచిపోయాయని గుర్తు చేశారు. ఆనాడు ఎంపీగా రైతుల వద్దకు వచ్చి, వచ్చేది మన ప్రభుత్వమేనని అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు 240 ఎకరాల్లో నిర్మించుకుంటున్నామన్నారు. నిధులకు ఒక్కరోజు ఆలస్యం అవ్వకుండా రూ.2400 కోట్లు గ్రీన్‌ ఛానల్‌లో విడుదల చేసే బాధ్యత తనదని, పనులు పూర్తి చేసే బాధ్యత తుమ్మల, మల్‌రెడ్డి రంగారెడ్డిలదని అన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కడతానని కేసీఆర్‌ అన్నారని, ఎన్నికలైన తర్వాత మందేసుకొని ఫామ్‌హౌజులో పడుకున్నారని విమర్శించారు. ఆయన లెక్క కాకుండా తుమ్మల, శ్రీధర్‌ బాబు ఫ్రూట్‌ మార్కెట్‌ను డిసెంబర్‌లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ‘‘రిజిస్ట్రేషన్ల ద్వారా సంవత్సరానికి రూ.15-16 వేల కోట్ల ఆదాయం వస్తోంది. వేల కోట్ల ఆదాయం ఇచ్చేవారు ఆఫీసుకు వచ్చి కుర్చీలు, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్‌ ఈస్‌ ఏ బ్రాండ్‌గా భావించి.. ఓఆర్‌ఆర్‌ లోపల 36 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా బ్రహ్మాండంగా ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ మాదిరి వసతి కల్పించేలా నిర్మిస్తున్నాం’’ అని తెలిపారు.


కాళేశ్వరం నీళ్లు రాకుండానే రాష్ట్రంలో పంటలు

‘‘ఆనాడు పండించిన పంటంతా కాళేశ్వరం నీళ్లతోనేనని కూలేశ్వరరావు చెప్పారు. కాళేశ్వరం కూలేశ్వరమై మూడేళ్లయింది. చుక్కనీరు కూలేశ్వరం నుంచి రాలేదు. చుక్కనీరు గోదావరి నుంచి లిఫ్టు చేయలేదు. కానీ, దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నాం. ఇన్నాళ్లు వాళ్లు చెప్పిందంతా అబద్ధమే’’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే వాళ్లు అడ్డం పడినా.. కాళ్లలో కట్టె పెట్టి శాపనార్ధాలు పెట్టినా.. ఏడిచినా.. పెడబొబ్బలు పెట్టినా.. మూసీలోపడి పందుల్లాగా దొర్లినా వారి ఏడుపు వినేది లేదని, అభివృద్ధి చేసుకోవడమేనని స్పష్టం చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించుకుంటామని, ఫ్యూచర్‌ సిటీ కట్టుకుంటామని, ఫ్రూట్‌ మార్కెట్‌ పూర్తి చేసుకుంటామని చెప్పారు. ‘‘మంచి కార్యక్రమాలు చేస్తుంటే మనల్ని చూసి ఏడ్చేవాళ్లుంటారు. కడుపులో మంటునోళ్లు.. అసూయ ఉన్నోళ్లకు అజీర్తి అవుతూనే ఉంటది. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మూడేళ్లలో లక్ష కోట్లు పెట్టి వాళ్లు కడితే కళ్ల ముందే కూలిపోయింది. లక్ష కోట్ల ప్రజల సొమ్మును గోదావరిలో కలిపిన వాళ్లకు తద్దినం పెట్టాల్సిన అవసరం ఉందా? లేదా? తాటి చెట్టులా పెరిగితే తెలివి ఎక్కువ ఉందని అనుకుంటున్నారు. ప్రాజెక్టులు ఎట్లా కట్టాలో.. లిఫ్టులు ఎలా మెయిన్‌టైన్‌ చేయాలో మనకు లెటర్లు రాస్తున్నారు. హరీశ్‌ రావు.. నీ దిక్కుమాలిన సలహాలు నీ మామకి ఇస్తే నడుములు విరిగి ఫామ్‌హౌజ్‌లో పడుకున్నాడు. నీ దిక్కుమాలిన సలహాలు మాకు తక్కువయ్యినయా.? అందుకే నోరు మూసుకొని ఉండమని చెబుతున్నా’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. నువ్వున్నా.. ఉండకపోయినా 2034 వరకు ప్రజా పాలన ఉంటుందని స్పష్టం చేశారు.

Updated Date - Jun 07 , 2026 | 06:15 AM