పంచపాండవుల చెరువు నుంచి కేసీఆర్ ఫామ్‌హస్‌కు నీళ్లు
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:08 AM
‘‘బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పడం ఆపనంతకాలం మేం నిజాలు చెబుతూనే ఉంటాం. మేం నిజాలు చెబితే మీకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు’’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు.
ఆయనకు ఎందుకీ ప్రత్యేక సౌకర్యం?.. నిజనిర్ధారణ కమిటీ వేద్దామా?
దిగుమతి బొగ్గుపై కేటీఆర్ అడిగిన ఏ విచారణకైనా సిద్ధమే
యాదాద్రి పవర్ ప్లాంట్‌తో రూ. 50వేల కోట్ల భారం
తెలంగాణకు కృష్ణా జలాల్లో మరణశాసనం రాసిందెవరు?
చంద్రబాబు ముందు మోకరిల్లి సంతకం పెట్టింది మీరు
తీవ్రస్థాయిలో మండిపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
యాదాద్రి పవర్ ప్లాంట్‌తో రూ. 50వేల కోట్ల భారం: సీఎం రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పడం ఆపనంతకాలం మేం నిజాలు చెబుతూనే ఉంటాం. మేం నిజాలు చెబితే మీకు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు’’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు. పంచపాండవుల చెరువు నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 400 ఎకరాలకు నీళ్లు వెళ్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు కృష్ణాజలాల విషయంలో శాశ్వత మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీయేనని.. యాదాద్రి ప్లాంట్‌తో రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చిందని బీఆర్ఎస్ అనడం వాళ్ల పైశాచిక ఆనందానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ‘‘ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? అక్కడ కరువు ఎందుకుంది? 100 దేశాల్లో ఎల్ నినో సమస్య ఉంది. బీఆర్ఎస్ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.’’ అని ధ్వజమెత్తారు. ‘‘కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు ఒక కాలువ తవ్వారు. పంచపాండవుల చెరువు నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్హౌ్సలోని 400 ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎవ్వరికీ లేని ప్రత్యేక వెసులబాటు కేసీఆర్ ఫామ్‌హౌ్‌సకే ఎందుకు? దీనిపై నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేద్దామా? పంపుల కనెక్షన్‌ను తొలగించడానికి కేసీఆర్ ముందుకు వస్తారా?’’అని నిలదీశారు.
బాధ్యులెవరు?
విద్యుత్ సంక్షోభం రాబోతోందని.. 1,040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేసీఆర్ హడావుడి చేశారని, నామినేషన్ బేసిస్‌పై ప్లాంట్లు ఇస్తున్నట్లు ఆయనే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ‘‘అందులో అవినీతి ఉందని నాడు మేం వ్యతిరేకించాం. మూడేళ్లలో రూ.17,950 కోట్లతో యాదాద్రి సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు కట్టడానికి బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు. అది పూర్తి కాక వ్యయం రూ.37,781 కోట్లకు పెరిగింది. దీనికి బాధ్యులు ఎవరు?’’ అని ప్రశ్నించారు. బొగ్గు, నీళ్లు అందుబాటులో ఉండే ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు కడతారని.. కానీ యాదాద్రిని సింగరేణి ప్రాంతంలో కాకుండా దామరచర్లలో నిర్మించారని.. సింగరేణిని నిండా ముంచి ఈ ప్రాజెక్టును కట్టారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి ప్రాజెక్టును మణుగూరు ప్రాంతంలో కట్టి ఉంటే ఖర్చు తగ్గేదని అభిప్రాయపడ్డారు. ‘‘యూనిట్ రూ.4.62కు మణుగూరులో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. యూనిట్ రూ.3.94 చొప్పున కొత్తగూడెంలో, సింగరేణి1, 2లో యూనిట్ రూ.4.05 చొప్పున విద్యుత్‌ఉత్పత్తి అవుతోంది. యాదాద్రిలో యూనిట్ రూ.6.60 అవుతోంది. ఫలితంగా యాదాద్రి వల్ల రూ. 50 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. వచ్చే 25 ఏళ్లలో లక్ష కోట్ల నష్టం జరగనుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు.
ఆ ప్లాంటులో గ్రేడ్ 9 బొగ్గు వద్దు, ఏదైనా నడుస్తుందని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని.. కానీ, గ్రేడ్ 9 కాకుండా మిగిలిన రకాల (గ్రేడ్ 18 దాకా ఉంటాయి) బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడితే బూడిద ఎక్కువగా వస్తుందని సీఎం తెలిపారు. యాదాద్రి ప్లాంటుకు అవసరమైన గ్రేడ్ 9 బొగ్గు లభ్యత సింగరేణిలో 2 మిలియన్ టన్నులు మాత్రమే ఉందని.. 141 టెండర్లు జరిగితే ఒక్కదాంట్లో కూడా సింగరేణి పాల్గొనకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. ‘‘దిగుమతి బొగ్గు కోసం టెండర్లలో పాల్గొనలేదు. 100 శాతం దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎన్జీటీలో కేసు వేయించి స్టే ఇప్పించారు. యాదాద్రికి కావాల్సిన మొత్తం 14 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చారు.
కానీ, మేం 2024లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించి, సింగరేణి బొగ్గును మాత్రమే వాడుతామని తీర్మానం చేయించి ఎన్జీటీలో స్టే ఎత్తివేయించాం’’ అని సీఎం గుర్తుచేశారు. ‘‘యాదాద్రిలో ఐదో యూనిట్ ఇంకా పూర్తి కాలేదు. నైనీ కోల్ నుంచి రోజుకు రెండు, మూడు ర్యాక్‌లు తీసుకొచ్చి యాదాద్రిలో విద్యుదుత్పత్తి మొదలుపెట్టాం. బొగ్గు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఈ రోజు నేను మాట్లాడాను. దేశీ బొగ్గునే యాదాద్రిలో వాడటానికి మేం ప్రయత్నాలు చేస్తున్నాం.
డ్రగ్స్, ఫామ్‌హౌస్, స్టార్ హోటళ్లు, 22 ఏ వంటి అంశాల్లో కేటీఆర్ బుకాయించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు బొగ్గు పూసుకుని, మారువేషం వేసుకుని తిరుగుతున్నడు ఆయన ముఖానికి’’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిగుమతి బొగ్గుపై విచారణ కావాలంటూ కేటీఆర్ లేఖ రాశారని.. ఆయన లేఖ మేరకు ఏ విచారణకైనా ఆదేశించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘ఏ విచారణ కావాలో కేటీఆర్ అడగాలి. ప్రజా కోర్టు ముందు బహిరంగ విచారణకైనా సిద్ధం’’ అని సవాల్ చేశారు. కాగా.. ఇటీవల ప్రారంభించిన ఆసుపత్రి సీఎం రేవంత్దేఅని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అన్నం తినేవాడు ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించాలి. నేను ప్రారంభించిన ఆసుపత్రిని కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రారంభించారు. ప్రారంభించినవన్నీ నావే అయితే ప్రపంచంలోనే శ్రీమంతుడిని అవుతాను’’ అని సమాధానమిచ్చారు. అవినీతిపై చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేశారు.
నాడు మోకరిల్లి...
2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీకి 515టీఎంసీలు ఇవ్వాలని ఎవరు సంతకం పెట్టారని సీఎం ప్రశ్నించారు. ‘‘సంతకం పెట్టినవాడు మనిషేనా?తెలంగాణకు కృష్ణా జలాల్లో శాశ్వత మరణశాసనం రాసింది ఎవరు? కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను ధారాదత్తం చేసింది మీరు కాదా? చంద్రబాబు ముందు మోకరిల్లి సంతకం పెట్టింది మీరు. కృష్ణా నీటిని చంద్రబాబు, జగన్‌కు తాకట్టు పెట్టారు. రోజమ్మ రాగి సంకటి పెడితే రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పింది మీరు. పాలమూరుకు నీళ్లు ఇవ్వాలని ఒక్కరోజైనా మాట్లాడారా? ప్రాజెక్టులపై రూ.40వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. కృష్ణాజలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంత నష్టం జరగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే జరిగింది. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడితే రావడం లేదు. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సిద్ధమా?’’అని నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి