చెక్క బొమ్మలాటకు ప్రాణం పోసిన కొండయ్య మృతి
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:21 AM
సుప్రసిద్ధ కొయ్యబొమ్మల కళాకారుడు మోతె కొండయ్య (80) బుధవారం తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : సుప్రసిద్ధ కొయ్యబొమ్మల కళాకారుడు మోతె కొండయ్య (80) బుధవారం తుది శ్వాస విడిచారు. జనగామ జిల్లాలోని నర్మెట గ్రామంలో జన్మించిన ఆయన చివరి దశలో జనగామలో నివసించారు. చెక్కతో చక్కటి బొమ్మలను రూపొందించి వాటితో నృత్యగాన ప్రదర్శన ఇచ్చేవారు. అద్భుతమైన సంగీతం, ఆటలతో ఈ బొమ్మలాట రక్తి కట్టేది. కొండయ్య అంతిమ సంస్కారాలకు హాజరైన ఆచార్య జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ చెక్కబొమ్మలు, తొలు బొమ్మలు, యక్షగాన ప్రదర్శన ఇవ్వడంలో కొండయ్యది అందెవేసిన చెయ్యి అన్నారు. ఆయన మృతి ఈ మూడు కళారూపాలకు తీరని లోటు అన్నారు. రవీంద్రభారతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కొండయ్య ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు