బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
ABN , Publish Date - May 15 , 2026 | 04:52 AM
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు, ప్రజా ...
పలు పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ ముందు విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు నిరసనకు దిగారు. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై పది రోజులు గడుస్తున్నా అతడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎస్‌ఎఫ్ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐడీడ బ్లూఏ మహిళా, విద్యార్థి నాయకులు పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు నిరసనకారులను బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ వినాయక రెడ్డి, పసునూరి రవీందర్, బక్క జడ్సన్, కృష్ణ కుమారి, జర్నలిస్టు సరిత తదిరులు మాట్లాడుతూ.. దేశాలు దాటి పారిపోయిన వారిని కూడా అరెస్టు చేస్తున్న పోలీసులు.. కేంద్ర మంత్రి కుమారుడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతృత్వంలో హైదరాబాద్‌లోని యాకత్‌పురా, మలక్‌పేట, ఐఎస్‌సదన్, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, రాగన్నగూడ తదితర ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ నేతలు తుర్కయంజాల్ చౌరస్తా వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. తనయుడు చేసిన తప్పునకు నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. భగీరథ్ కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీఐ నేతలు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో వినూత్న ప్రచారం నిర్వహించారు. భగీరథ్‌కు సంకెళ్లు వేయకుండా గాజులు వేసి ప్రజల ముందు నిలబెట్టాలని వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకురాలు పుష్పలత డిమాండ్ చేశారు. భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.