Share News

22ఏపై వాస్తవాలు అసెంబ్లీలో చెబుతాం: పొంగులేటి

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:40 AM

22ఏ వివాదంపై అసెంబ్లీ వేదికగానే వాస్తవాలను ప్రజల ముందు పెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండేవి.. తమ ప్రభుత్వం వచ్చాక ఎంత విస్తీర్ణం ఉందనే వివరాలను సభ ముందు ఉంచుతామని అన్నారు

22ఏపై వాస్తవాలు అసెంబ్లీలో చెబుతాం: పొంగులేటి
pongulatisrinivasreddy

హైదరాబాద్‌, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): 22ఏ వివాదంపై అసెంబ్లీ వేదికగానే వాస్తవాలను ప్రజల ముందు పెడతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండేవి.. తమ ప్రభుత్వం వచ్చాక ఎంత విస్తీర్ణం ఉందనే వివరాలను సభ ముందు ఉంచుతామని అన్నారు. మంగళవారం, సచివాలయంలో ఆయన విలేకరుల మాట్లాడుతూ.. నిషేధిత జాబితా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోర్టు ఆదేశించడంతోనే కొత్త జాబితాలను సిద్ధం చేశామని వివరించారు. రాష్ట్రంలో 1.24 కోట్ల ఎకరాలు ఈ జాబితాలో ఉన్నాయంటూ ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని.. అందులో సగం అటవీ, దేవాదాయ, ప్రభుత్వ భూములే ఉన్నాయని మండిపడ్డారు. ‘అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం ఏమీ అనడం లేదు కదా..’ అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు రిజిస్ర్టేషన్‌ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో రెవెన్యూ సమీక్షలు పూర్తి చేశామని.. 22ఏతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సమస్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నామని తెలిపారు. రీ సర్వే కోసం నియమించిన లైసెన్స్‌ సర్వేయర్లు, ప్రతిపక్షాల మాటలు విని పూర్తి స్థాయి వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు చూస్తామని.. మాట వినకపోతే ఇచ్చిన లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్‌ పెరిగిందని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని మంత్రి తెలిపారు. అడిగినన్ని ఇళ్లు ఇవ్వడం లేదని కొందరు తనపై కోపంతో ఉన్నారని పేర్కొన్నారు. అయితే, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. నిజమైన అర్హులకే ఇళ్లను కేటాయిస్తామని తేల్చి చెప్పారు.

Updated Date - Sep 02 , 2026 | 03:47 AM