Share News

పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో కాల్పుల కలకలం

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:06 AM

తాండూరు మాజీ ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌) పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన మొయినాబాద్‌ ఫాంహౌస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం రాత్రి ఇక్కడ కాల్పులు కలకలం సృష్టించాయి.

పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌లో కాల్పుల కలకలం

  • డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందని ఈగల్‌ టీమ్‌ మెరుపు దాడి

  • గాల్లోకి కాల్పులు జరిపిన డ్రగ్స్‌ పార్టీలోని వ్యక్తి

  • ఎనిమిది మందికి డ్రగ్స్‌ పరీక్షలు జరిపిన పోలీసులు

  • ఆ సమయంలో ఫాంహౌస్‌లో ఏపీకి చెందిన ఓ ఎంపీ

  • మొత్తం మూడు రాష్ట్రాల రాజకీయ నాయకులున్నట్లు ప్రచారం

  • రోహిత్‌ రెడ్డి అరెస్టు.. 2 గ్రాముల కొకైన్‌, రివాల్వర్‌ స్వాధీనం

మొయినాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తాండూరు మాజీ ఎమ్మెల్యే (బీఆర్‌ఎస్‌) పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి చెందిన మొయినాబాద్‌ ఫాంహౌస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. శనివారం రాత్రి ఇక్కడ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ డ్రగ్స్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారం రావడంతో ఈగల్‌ బృందాలు మెరుపు దాడులు చేశాయి. ఆ సమయంలో డ్రగ్స్‌ పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో ఒకరు తొలుత గాలిలోకి ఒక రౌండు; తర్వాత ఈగల్‌ బృందంపై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈగల్‌ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) రంగంలోకి దిగింది. పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కోకైన్‌, ఇతర మత్తు పదార్థాలతోపాటు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఎనిమిది మంది డ్రగ్స్‌ పార్టీ చేసుకుంటున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని పరీక్షలు చేస్తున్న పోలీసులు వచ్చిన రిపోర్టుల ఆధారంగా అరెస్టులు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫాంహౌస్‌లో ఆ సమయంలో ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్‌ యాదవ్‌, మొరగనేని రమేశ్‌, వి.శ్రావణ్‌ కుమార్‌, నల్లపనేని విజయ్‌ కృష్ణ, రితీశ్‌ రెడ్డి, నీవిత్‌ శర్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు మూడు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. ఈ అంశానికి సంబంధించి ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Mar 15 , 2026 | 05:08 AM