మెడికల్ హబ్‌పై యుద్ధం దెబ్బ
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:12 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం హైదరాబాద్‌లోని మెడికల్ టూరిజం, ఆతిథ్య రంగంపై తీవ్రంగా పడుతోంది. మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో గత కొద్దిరోజులుగా...
వైద్య చికిత్సల కోసం విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రోగుల సంఖ్య 30 శాతం తగ్గుదల
గత 15 రోజుల్లో 434 విదేశీ విమాన సర్వీసుల రద్దు
ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల ఆదాయానికి గండి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం హైదరాబాద్‌లోని మెడికల్ టూరిజం, ఆతిథ్య రంగంపై తీవ్రంగా పడుతోంది. మధ్య ప్రాచ్యంలోని పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో గత కొద్దిరోజులుగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు, హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్లకు ఆదాయం పడిపోతోంది. హైదరాబాద్ నగరం దేశంలో ప్రముఖ మెడికల్ టూరిజం హబ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులకు ఏటా వేలాది మంది విదేశీ రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా దేశాల నుంచి రోగులు ఎక్కువగా వస్తున్నారు. అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా చికిత్స కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నారు. అత్యధికంగా నైజీరియా, ఇథియోపియా, కెన్యా, టాంజానియా, సౌదీ అరేబియా, యెమెన్ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విదేశీ రోగులు ముఖ్యంగా గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, ఆర్థోపెడిక్ సర్జరీలు, న్యూరో సర్జరీలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండడమే కాకుండా.. పాశ్చాత్య దేశాల కన్నా తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యం అందుతుంది. రోగులు వేచి ఉండే సమయం తక్కువ ఉండడంతోపాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో గత దశాబ్ద కాలంలో విదేశీ రోగుల సంఖ్య దాదాపు రెండింతలు పెరిగింది. 2014లో సుమారు 75 వేల మంది విదేశీ రోగులు వైద్యచికిత్సల కోసం హైదరాబాద్‌కు రాగా, 2024 నాటికి ఇది రెట్టింపు అయింది. దీంతో మెడికల్ టూరిజం, ఆతిథ్య రంగాల ద్వారా హైదరాబాద్‌కు ఏటా రూ.వేల కోట్ల ఆదాయం వస్తోంది. అయితే ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగితే.. మెడికల్ టూరిజం, ఆతిథ్య రంగాలకు 30 నుంచి 40 శాతం నష్టం జరిగే అవకాశాలున్నాయి. యుద్ధం కారణంగా కొన్ని దేశాల నుంచి విమాన సర్వీసులు తగ్గడం, భద్రతపై ఆందోళనలు పెరగడం వంటి కారణాల వల్ల హైదరాబాద్‌కు రోగుల రాక కొంత మందగించింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యెమెన్, ఇరాక్, ఒమన్ వంటి దేశాల నుంచి వచ్చే రోగుల సంఖ్య కొంత తగ్గిందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా విదేశాల నుంచి ప్రతి నెలా 2600 వరకు విమాన సర్వీసులు (రాక,పోకలు) నడుస్తుంటాయి. అయితే గడిచిన 15 రోజుల్లో హైదరాబాద్‌కు నడిచే 434 విదేశీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో విదేశీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గల్ఫ్ దేశాల విమాన సర్వీసులు ఎక్కువగా రద్దవడంతో.. యూరప్, గల్ఫ్ దేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య 30 శాతానికిపైగా తగ్గింది. అయితే ఆఫ్రికా దేశాలైన నైజీరియా, టాంజానియా, ఇథియోపియా, కెన్యా వంటి దేశాల నుంచి రోగుల ఇంకా వస్తున్నారు. ఆస్పత్రులు మాత్రమే కాకుండా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, మెడికల్ ట్రాన్స్‌పోర్టర్ సేవలు మెడికల్ టూరిజంతో అనుసంధానమై ఉన్నాయి. విదేశీ రోగుల రాక తగ్గితే ఈ రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రూ.7 వేల కోట్ల వ్యాపారం..
హైదరాబాద్‌లో మెడికల్ టూరిజం ద్వారా ఏటా రూ.4వేల కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అంచనా. హైదరాబాద్‌కు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 1.5లక్షల మంది విదేశీ రోగులు వస్తుంటారు. సగటున ఒకొక్కరికి రూ.3లక్షల విలువ చేసే వైద్య చికిత్సలు అందించినా రూ.4,500 కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంతోపాటు హాస్పిటాలిటీ రంగానికి కూడా ఎంతో ఆదాయం ఉంటుంది. విదేశీ రోగులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులందరికీ అవసరమైన హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్లు, ట్రావెల్ ఏజెన్సీలు, మెడికల్ ట్రాన్స్‌పోర్టు సేవల ద్వారా మరో రూ.2,500కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో ఆస్పత్రులే కాకుండా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, మెడికల్ ట్రాన్స్‌పోర్టర్ సేవలు మెడికల్ టూరిజంతో అనుసంధానమై ఉన్నాయి. విదేశీ రోగుల రాక తగ్గితే ఈ రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.