లంచాలు ఇవ్వలేక.. పదోన్నతులు కోల్పోతున్నాం
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:18 AM
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో సూపరింటెండెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) దాకా వివిధ పోస్టుల పదోన్నతుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయలు చేతులు మారాయని...
ఏవో పోస్టు పదోన్నతుల్లో డీహెచ్, ఏడీ వసూళ్ల దందా
పదోన్నతులపై విచారణ చేపట్టాలని బాధిత ఉద్యోగుల లేఖ
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో సూపరింటెండెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) దాకా వివిధ పోస్టుల పదోన్నతుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయలు చేతులు మారాయని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్.చోంగ్థుకు బాధితులు శనివారం లేఖ రాశారు. ఎన్నో ఏళ్లుగా వైద్యశాఖలో పని చేస్తున్నప్పటికీ, లంచాలు ఇవ్వలేక పదోన్నతులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగి పదవీ విరమణ అవుతున్న చివరి రోజు హడావిడిగా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ ఏర్పాటుచేసి పదోన్నతులు ఖరారు చేశారని, వరంగల్, హైదరాబాద్ జోన్ పరిధిలోని అభ్యర్థుల నుంచి సుమారు రూ. 50 లక్షలు వసూలు చేశారని వారు ఆరోపించారు. ఈ మొత్తాన్ని ఆ కార్యాలయంలోని నవీన్ నాయక్ అనే ఉద్యోగి వసూలు చేయగా.. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్, అదనపు డైరెక్టర్ శశిశ్రీతో పాటు మరికొందరు పంచుకున్నారని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు.