Share News

100 కోట్ల పైనే

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:31 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, సస్పెన్షన్‌ వేటుపడ్డ అదనపు ఎస్పీ భుజంగరావు, ఆయన బినామీలు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు ...

100 కోట్ల పైనే

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, ఏఎస్పీ భుజంగరావు అక్రమార్జన

  • హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లతో పాటు బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ సోదాలు

  • ఆయనకు సూర్యాపేటలో 27.29 ఎకరాల భూమి

  • హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయం, 2 ఇళ్లు,5 ఇళ్ల స్థలాలు.. ఇంట్లో కిలో బంగారు నగలు

  • 15 చోట్ల తనిఖీలు.. కీలక పత్రాలు స్వాధీనం

హైదరాబాద్‌/వనస్థలిపురం/తుంగతుర్తి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, సస్పెన్షన్‌ వేటుపడ్డ అదనపు ఎస్పీ భుజంగరావు, ఆయన బినామీలు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ తదితర 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. భుజంగరావు అక్రమార్జన రూ.100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హఫీజ్‌పేటలోని భుజంగరావు ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో ఆయన బంధువులు, స్నేహితులు, బినామీ రవీందర్‌రావు ఇళ్లల్లో సోదాలు జరిపామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. భుజంగరావు తన సర్వీసులో అవినీతికి పాల్పడి భారీగా అక్రమార్జన చేశారని, ఆయన ఆస్తుల వివరాలు గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆస్తులు, పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన బ్యాంక్‌ లావాదేవీలు, కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. భుజంగరావుకు సూర్యాపేటలో 27.29 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఒక వాణిజ్య సముదాయం, రెండు విలాసవంతమైన ఇళ్లు, ఐదు ఇళ్ల స్థలాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.92 కోట్లు ఉందని, మార్కెట్‌ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందన్నారు. ఆయన ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రూ.3.83 లక్షల నగదు, బ్యాంకులో రూ.8 లక్షల బ్యాలన్స్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. 29 ఖరీదైన మద్యం బాటిళ్లను గుర్తించి.. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. భుజంగరావును అరెస్టు చేశారు. ఆయన హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌లో ఏసీపీగా, అనంతరం అడిషనల్‌ ఎస్పీగా పనిచేశారు. కాగా, ఏసీబీ అధికారులు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో భుజంగరావు మామ, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి దుగ్యాల రాజేశ్వరరావు ఇంట్లో తనిఖీకి వెళ్లగా.. ఇల్లు తాళం వేసి ఉంది. దాంతో గంటసేపు వేచి చూశారు.

Updated Date - Jun 04 , 2026 | 05:31 AM