Share News

ఫార్మా సిటీ పరిహారంపై సీఐడీ!

ABN , Publish Date - May 27 , 2026 | 04:34 AM

ఫార్మాసిటీ భూసేకరణలో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో ఫార్మాసిటీ కోసం వేల ఎకరాల భూములను సేకరించారు.

ఫార్మా సిటీ పరిహారంపై సీఐడీ!

  • 250 ఎకరాల భూదాన్‌భూములకు పరిహారం.. గత ప్రభుత్వంలో 40 కోట్లు పంచుకున్న నేతలు

  • అసైన్డ్‌ భూముల పరిహారంలోనూ చేతివాటం

  • కుంభకోణాన్ని బట్టబయలు చేసిన ‘ఆంధ్రజ్యోతి’

  • గత ఏడాదే విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్‌

  • తాటిపర్తిలో భూదాన్‌ భూముల గోల్‌మాల్‌ నిర్ధారణ

  • ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక ఇచ్చిన కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ యాచారం)

ఫార్మాసిటీ భూసేకరణలో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో ఫార్మాసిటీ కోసం వేల ఎకరాల భూములను సేకరించారు. భూసేకరణ సమయంలో బాధిత రైతులకు కొంత పరిహారంతో పాటు అభివృద్ధి చేసిన ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే, భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో చక్రం తిప్పిన కొందరు పెద్దలు స్థానిక అధికారులపై ఒత్తిడి చేసి భూదాన్‌, అసైన్డ్‌ భూములను కూడా సాధారణ భూములుగా పరిగణించి తమ బినామీలకు పరిహారం ఇప్పించుకున్నారు. ఇలా కొందరు నేతలు కోట్ల రూపాయల పరిహారాన్ని పంచుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. 2017 నవంబరు 9న ‘పరిహారం పంచుకున్నారు’ కథనం, 2025 ఫిబ్రవరి 12వ ‘బినామీలకు పరిహారం’ కథనం దీనికి సంబంధించినవే. తాటిపర్తిలోని 250 ఎకరాల భూదాన్‌ భూములను పట్టా భూములుగా మార్చి రూ.40 కోట్ల పరిహారం అందజేశారు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ ఇప్పుడు వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. దీనిపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. దీనిపై విచారించిన జిల్లా యంత్రాగం నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. కుంభకోణంలో అధికారులతో పాటు కొందరు ప్రజా ప్రతినిధుల పాత్రలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా యంత్రాంగం గతంలో తప్పిదాలు జరిగినట్లు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో సర్కార్‌ సూత్రధారులు, పాత్రధారులను వెలికితీసేందుకు ఉన్నతస్థాయి విచారణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పరిహారం మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించారు.


భూదానం పరాధీనం

గత ఫ్రభుత్వ హయంలో ఫార్మా సిటీ భూసేకరణ కోసం యాచారం మండలం తాటిపర్తి, మేడిపల్లి, నానక్‌నగర్‌, కుర్మిద్ద గ్రామాల్లో భూములను సేకరించారు. జీవో నంబరు 123, జీవో 40, జీవో 120ల ద్వారా వేరు వేరుగా భూసేకరణ చేశారు. ఇందులో యాచారం మండలంలోని తాటిపర్తి పరిధిలో 104 సర్వే నెంబర్‌లోని 250 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కొందరు దాతలు 1955లో భూదాన్‌ యజ్జ బోర్డుకు దానం చేశారు. 1997లో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో కూడా ఈ విషయం నమోదైంది. 2006లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమిని భూదాన్‌గా పేర్కొంటూ సర్క్యూలర్లు జారీ చేశారు. వేరే వివాదంలో 2013లో ఇవి తమ భూములేనంటూ భూదాన్‌ యజ్ఞ బోర్డు యాచారం తాహసీల్దారుకు కూడా లేఖ రాసింది. ఇన్ని ఆధారాలున్న ఈ భూములను ఫార్మాసిటీ కోసం సేకరించారు. ఆ సమయానికి కొందరు స్థానికులు సాగు చేసుకుంటున్నారు. వారు కూడా కాకుండా ఈ భూమికి హక్కుదారులమంటూ హైదరాబాద్‌ నుంచి కొందరు తెరపైకి వచ్చారు. వీటిని కొనుగోలు చేశామని హక్కులు క్లెయిమ్‌ చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు భూసేకరణ సమయంలో వీటిని పట్టాలుగా పరిగణించి ప్రైవేటు వ్యక్తులకు ఎకరాకు రూ.16 లక్షల చొప్పున రూ.40 కోట్లు పరిహారం చెల్లించారు. దీని వెనుక అప్పటి ప్రభుత్వంలోని కొందరు నేతలు, అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సాగు చేసుకుంటున్న స్థానికులకు నయా పైసా దక్కలేదు. దీనిపై అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలకు ప్రభుత్వం స్పందించింది. సమగ్ర నివేదిక అందించాలంటూ రెవెన్యూ శాఖ కారదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నివేదిక కథనాలను అక్రమాలను ధ్రువీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు దిశగా వెళ్తోంది.


ప్లాట్లు కొల్లగొట్టే యత్నం

ఈ భూదాన భూములకు రూ.కోట్లలో పరిహారం పొందిన అక్రమార్కులు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లపై కూడా కన్నేశారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు 121 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తుంది. కొందరికి ప్లాట్లు కూడా అందచేశారు. భూదాన భూములకు పరిహారం ఇచ్చిన విషయం బయటకు రావడంతో వాటికి ప్లాట్లు ఇవ్వకుండా ఆపేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అసైన్డ్‌ రికార్డులు సరిగా లేకపోవడంతో దీన్ని ఆసరా చేసుకుని కొందరు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పరిహారాన్ని స్వాహా చేశారు.

కోర్టుకు ఫిర్యాదు

దీనిపై అధికారుల విచారణ పూర్తి కాకపోవడంపై స్థానికులూ ఆగ్రహంతో ఉన్నారు. భూదాన్‌ భూముల పరిహారం అనర్హులకు అందించారని, దీనిపై విచారణ చేసి రైతులను ఆదుకోవాలని తాటిపర్తి అప్పటి సర్పంచ్‌ రమేష్‌ గతంలో కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు కోర్టులో కేసు వేశారు. దీనిపై లోకాయుక్త అధికారులను నివేదిక కోరింది.

Updated Date - May 27 , 2026 | 04:34 AM