TG News: మావోల్లో మిగిలింది 17 మందే: డీజీపీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:34 PM
మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. శనివారం ప్రెస్‌మీట్‌ల్ మాట్లాడిన డీజీపీ.. గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బడ్సే సూక్కా అలియాస్ దేవాతో పాటు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 3: మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. శనివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీజీపీ.. గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు బడ్సే సూక్కా అలియాస్ దేవాతో పాటు 17 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. వీరితో పాటు.. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్య.. ఇద్దరూ లొంగిపోయారని తెలిపారు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వ్యక్తి దేవా అని.. ఎన్ఐఏ నుంచి దేవా పైన రూ. 75 లక్షల రివార్డ్ ఉందని చెప్పారు. ఆవులం సోమా, భేమే, సుశీల, వేముల రాజు, నందయ్య, మంకు, అండా ఇలా మొత్తం 20 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు.
లొంగిపోయిన వారిలో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అడ్లూరి ఈశ్వరి ఉన్నారని తెలిపారు. 2ఎల్ఎంజీ, అమెరికన్ మేడ్ కోల్ట్ గన్, ఇజ్రాయెల్ మేడ్ టవర్ వేపన్, 8 ఏకే47 గన్స్, 8 ఎస్ఎల్ఆర్ వెపన్స్, 4 బ్యారెల్ గ్రానైడ్ లాంచర్స్ సమర్పించినట్లు డీజీపీ తెలిపారు. హెలికాప్టర్‌ను సైతం కూల్చివేసే హేమోనిషాన్ 19 సైతం మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.
ఇక పీఎల్‌జీఏ బెటాలియన్‌లో 400 మందికి పైగా మావోయిస్టులు ఉండేవారని.. ఇప్పుడు వారి సంఖ్య 66కు చేరిందన్నారు డీజీపీ. ఈ సంఖ్యను బట్టిచూస్తే పీఎల్‌జీ పూర్తిగా క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒక్కరు మాత్రమే తెలంగాణ స్టేట్ కమిటీ వారు మావోల్లో మిగిలారని వివరించారు. సీఎం పిలుపుతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలిపారు. డివిజన్ సభ్యులకు రూ. 5 లక్షలు, ఏరియా సభ్యులకు రూ. 4 లక్షలు, మిగతా సభ్యులకు రూ. 1 లక్ష రివార్డు అందజేస్తున్నట్లు తెలిపారాయన. మొత్తంగా లొంగిపోయిన వారికి రూ. 1.80 కోట్లు రివార్డు అందిస్తామన్నారు. తక్షణ సాయంగా రూ. 1 లక్షల చొప్పున ఇస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
ఇప్పటి వరకు 576 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. తమకున్న సమాచారం ప్రకారం మావోయిస్టుల్లో తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు మాత్రమే ఉన్నారన్నారు. ఐదుగురు సెంట్రల్ కమిటీలో, నలుగురు స్టేట్ కమిటీ వారు ఉన్నట్లు డీజీపీ చెప్పారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read:
Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.. కిషన్‌రెడ్డి ఫైర్
Marital Relationship Tips: భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఇదేనా?