National President: నితిన్ నబీన్‌కే బీజేపీ పగ్గాలు!
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:51 AM
భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 19వ తేదీన ఈ ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ...
కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొనే అవకాశం
అమిత్‌షా, రాజ్‌నాథ్‌వంటి సీనియర్ల ప్రతిపాదన!
19న నామినేషన్లు.. 20న ఎన్నిక
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 19వ తేదీన ఈ ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ, 20న ఎన్నిక నిర్వహించనున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్‌నే కొత్త అధ్యక్షుడి గా ఎన్నుకోవటం దాదాపు ఖాయమైందని అంటున్నారు. బీజేపీ సంస్థాగత నియమావళి ప్రకారం అధ్యక్షుడిగా పార్టీ నేతలు ఎవరైనా పోటీ చేయవచ్చు. అయితే, అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలంటే కనీసం ఐదు రాష్ట్రాల నుంచి మద్దతు ప్రతిపాదనలు అందాలి. ఒక్కో రాష్ట్రం నుంచి కనీసం 20 మంది ఫలానా నాయకుడిని జాతీయ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తున్నామని పత్రాలు సమర్పించాలి. ఆ 20 మంది కూడా పార్టీలో కనీసం 15 ఏళ్ల నుంచి ఉంటున్నవారైఉండాలి. కాగా, నితిన్ నబీన్‌కు మద్దతుగా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ వంటి సీనియర్లు పత్రాలు సమర్పించనున్నట్లు తెలిసింది. నితిన్‌ను జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 20వ తేదీన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ముఖ్య నేతల సమక్షంలో ప్రధాని నరేంద్రమోదీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారని సమాచారం.
బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ శాఖల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేతలు దాదాపు 3,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారికి ఇప్పటికే ఢిల్లీకి రావాలని పిలుపు అందింది.
రాజ్యసభకు పోటీ చేయను: దిగ్విజయ్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత, మరోసారి ఎగువ సభకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎ్‌సఎస్ సంస్థాగత బలంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన కొన్ని వారాలకే ఈ ప్రకటన రావడం గమనార్హం.