Share News

పిల్లలకు కొత్త రుచులు పరిచయం చేయాలి!

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:26 AM

ఇంట్లో రోజూ పెట్టే అన్నం, పప్పు, కొన్ని కూరగాయలను పిల్లలు ఇష్టంగానే తింటారు. కొత్తగా ఏదైనా పెడితే మాత్రం ముఖం తిప్పేస్తారు.

పిల్లలకు కొత్త రుచులు పరిచయం చేయాలి!

  • ఆ విషయంలో తల్లులదే కీలక పాత్ర

  • ఇష్టమైన కొన్ని ఆహార పదార్థాలే తినిపిస్తూ ఉంటే

  • పోషకాహార లోపానికి దారితీసే ప్రమాదం

  • హైదరాబాద్‌ పిల్లలపై ఎన్‌ఐఎన్‌ పరిశోధనలో వెల్లడి

  • జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌లో ప్రచురితం

(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి): ఇంట్లో రోజూ పెట్టే అన్నం, పప్పు, కొన్ని కూరగాయలను పిల్లలు ఇష్టంగానే తింటారు. కొత్తగా ఏదైనా పెడితే మాత్రం ముఖం తిప్పేస్తారు. ఒక్క ముద్ద కూడా తినరు. బలవంతంగా పెడితే వాంతి చేసుకుంటారు. తమకు నచ్చిన కొన్ని పదార్థాలు తప్ప కొత్తవి తినరు. ఒకటిరెండు సార్లు అడిగిన తర్వాత అమ్మలు కూడా కొత్త ఆహార పదార్థాలను పెట్టకుండా వదిలేస్తారు. పిల్లలు అలా కొత్త పదార్థాలను తినకపోవడానికి ఆహారంపై ఇష్టం లేకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) పరిశోధన చెబుతోంది.

కొత్త ఆహార పదార్థాలను ప్రయత్నించడానికి ఇష్టపడకపోవడం, వాటిని చూసి వెనక్కి పారిపోవడం లేదా తినడానికి నిరాకరించడాన్ని ‘ఫుడ్‌ నియోఫోబియా’గా పేర్కొంటున్నారు. రెండు నుంచి ఏడేళ్ల వయసు మధ్య చిన్నారుల్లో ఈ ప్రవర్తన కనిపించవచ్చని చెబుతున్నారు. జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషనల్‌ సైన్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ఫుడ్‌ నియోఫోబియా పరిస్థితిని పరిశీలించింది. ‘రెండు నుంచి ఏడేళ్ల వయసున్న పిల్లల్లో నూతన ఆహారం పట్ల విముఖత, దాని ప్రభావిత అంశాలు: తల్లుల ఆహార సంబంధిత పరిజ్ఞానం, వైఖరులు, ఆచరణల పాత్రపై ఓ క్రాస్‌ సెక్షనల్‌ అధ్యయనం’ శీర్షికన ఇది ప్రచురితమైంది.


కార్తికేయన్‌ రామానుజం నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. కొందరు పిల్లల్లో ఇది సాధారణంగా కనిపించే అంశమే అయినప్పటికీ, ఆహార వైవిధ్యాన్ని పరిమితం చేసే స్థాయికి చేరితే వారి పోషకాహారంపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. పోషకాహార లోపంతోనూ సంబంధం రెండు నుంచి ఏడేళ్ల వయసున్న పిల్లలు తమకు తెలిసిన ఆహారం తప్ప మరేదీ తీసుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పరిశోధకులు హైదరాబాద్‌లో అధ్యయనం చేశారు.

2025 ఆగస్టు నుంచి అక్టోబరు వరకు 150 మంది తల్లులు, వారి పిల్లల నుంచి వివరాలు సేకరించారు. పిల్లల్లో కొత్త ఆహారంపై భయాన్ని అంచనా వేయడానికి చైల్డ్‌ ఫుడ్‌ నియోఫోబియా స్కేల్‌ను ఉపయోగించారు. పిల్లల సగటు ఫుడ్‌ నియోఫోబియా స్కోరు 27.4గా నమోదైంది. మొత్తం పిల్లల్లో 12 శాతం మందిలో ఈ లక్షణం తక్కువగా ఉండగా, 76.7శాతం మందిలో మధ్యస్థంగా, 11.3శాతం మందిలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే దాదాపు 88శాతం మంది పిల్లలు కొత్త ఆహారాన్ని స్వీకరించడంలో కొంతమేర వెనుకంజ వేస్తున్నట్లు గుర్తించారు.

2-7ఏళ్ల వయసు పిల్లల్లో 24.8 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరని, 8.6 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరని, 22 శాతం మంది వయసుకు తగ్గ బరువు లేరని గుర్తించారు. ఆహార వైవిధ్యాన్ని నిరాకరించే పిల్లలు తమకు అలవాటైన కొద్దిపాటి పదార్థాలకే పరిమితమవుతారని, దాంతో అవసరమైన పోషకాలు అందకపోవచ్చని పరిశోధకులు విశ్లేషించారు. మరోవైపు, దీర్ఘకాలిక పోషకాహార లోపం కూడా ఆకలి, రుచులను స్వీకరించే తీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే, ఈ అధ్యయనం ఒకే పట్టణంలోని తక్కువ ఆదాయ వర్గానికి చెందిన సమాజానికి పరిమితం కావడంతో పాటు నమూనా పరిమాణం కూడా తక్కువగా ఉందని, ఒక నిర్దిష్ట కాలంలో నిర్వహించిన అధ్యయనం కావడంతో ప్రత్యక్ష కారణ- ఫలిత సంబంధాలను నిర్ధారించలేదని తెలిపారు.


తల్లులకు అవగాహన పెరిగితేనే.. తల్లులకున్న పోషకాహార సంబంధిత అవగాహన, వైఖరులు, ఆహారం పెట్టే పద్ధతులు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పోషకాహారంపై మితస్థాయి అవగాహనతో పాటు సానుకూల ఆహారపు అలవాట్లు కలిగిన తల్లుల పిల్లల్లో ఫుడ్‌ నియోఫోబియా స్కోర్లు తక్కువగా ఉన్నాయి. తల్లుల్లో పోషకాహార సంబంధిత అవగాహన, సానుకూల వైఖరి ఎక్కువగా ఉన్నకొద్దీ పిల్లల్లో ఫుడ్‌ నియోఫోబియా స్కోరు తగ్గుతున్నట్లు గుర్తించారు. తక్కువ స్థాయి అవగాహన, వైఖరి, ఆచరణలు ఉన్న తల్లుల పిల్లల్లో సగటు స్కోరు 30.2గా ఉండగా, మధ్యస్థ స్థాయిలో ఉన్నవారి పిల్లల్లో 26.5గా నమోదైంది.

అధిక స్థాయిలో ఉన్నవారి పిల్లల్లో 25.9గా ఉంది. ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌లో సైంటిస్ట్‌-సి, ఈ అధ్యయన ప్రధాన రచయిత కార్తికేయన్‌ రామానుజం మాట్లాడుతూ.. ఈ పరిశోధన ఫలితాలు రోజువారీ ఆహారం పెట్టే అలవాట్ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి చేయకుండా క్రమంగా కొత్త ఆహారానికి అలవాటు చేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు స్వయంగా వివిధ రకాల కొత్త ఆహార పదార్థాలను తింటుంటే పిల్లలకు వాటిపై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.

అన్ని రకాల ఆహార పదార్థాలను కొనుగోలు చేసే అవకాశం లేని కుటుంబాల్లో పిల్లలకు భిన్నమైన ఆహారాలను పరిచయం చేసే అవకాశాలు పరిమితమవుతాయని విశ్లేషించారు. ఐసీడీఎస్‌, పోషణ్‌ అభియాన్‌ వంటి కార్యక్రమాల్లో పిల్లల సాధారణ ఆహార ప్రవర్తన, కొత్త ఆహారాలను ఒత్తిడి లేకుండా పరిచయం చేసే పద్ధతులు, తల్లిదండ్రుల ఆహార అలవాట్ల ప్రభావం వంటి అంశాలపై కౌన్సెలింగ్‌ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:34 AM