Share News

హైదరాబాద్‌లో బోగస్ ఫారం-7 కలకలం.. పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:42 AM

హైదరాబాద్‌ ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఫారం-7 పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. 210వ పోలింగ్‌ కేంద్ర పరిధిలో 31 ఓట్ల తొలగింపునకు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో బోగస్ ఫారం-7 కలకలం..  పోలీసుల దర్యాప్తు
Musheerabad

హైదరాబాద్‌, అక్టోబర్ 6: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బోగస్ ఫారం-7 పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. 210వ పోలింగ్‌ కేంద్ర పరిధిలో 31 మంది ఓటర్ల ఓట్లను తొలగించేందుకు నకిలీ పత్రాలను సమర్పించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ) బాలచందర్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఈఆర్‌ఓ ఫిర్యాదు చేశారు. ఫారం-7కు సంబంధించిన నకిలీ పత్రాల వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ల వివరాల్లో అక్రమాలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా అధికారులను హెచ్చరించారు.


ఇదిలా ఉండగా.. బోగస్ ఫారం-7 పత్రాలను బీఎల్‌ఏలకు బీజేపీనే అందించిందని కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు పోలీస్‌ కమిషనర్‌ను కోరారు. 31 ఓట్ల తొలగింపునకు సమర్పించినట్లు చెబుతున్న పత్రాల వెనుక ఎవరు ఉన్నారు, వాటిని ఎవరు సిద్ధం చేశారు, ఏ ఉద్దేశంతో సమర్పించారనే అంశాలపై దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Oct 06 , 2026 | 11:26 AM