తుమ్మిడిహెట్టిపై కదలిక
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:02 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ విషయంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబరు 1న మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శులతో న్యూఢిల్లీలో సమావేశం కానుంది.
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో సెప్టెంబరు 1న సీడబ్ల్యూసీ భేటీ
ప్రధానికి సీఎం లేఖ నేపథ్యంలో సమావేశం
జల వివాదాలపై తెలుగు రాష్ట్రాలతో 7న భేటీ
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ విషయంలో కదలిక వచ్చింది. ఈ అంశంపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సెప్టెంబరు 1న మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శులతో న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించుకోవడానికి అనుమతి ఇప్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి జూన్ 11న సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. కాగా, వార్థాపై ఒక బ్యారేజీ, వెన్‌గంగాపై మరొకటి నిర్మించనున్నారు. వార్థా బ్యారేజీని 60 గేట్లతో, 867 మీటర్ల పొడవున నిర్మించనుండగా, వెన్‌గంగా బ్యారేజీ నిర్మాణాన్ని 77 గేట్లతో, 1113.50 మీటర్లు చేపట్టనున్నారు. ఈ రెండింటినీ 150 మీటర్ల ఎత్తుతో నిర్మించనుండగా, రెండు బ్యారేజీలు ఒకే కాంప్లెక్స్‌గా ఉండనున్నాయి. నది ప్రవాహానికి అడ్డంగా లంబాకారంలో బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డిజైన్‌పై సీడబ్ల్యూసీతో సంప్రదింపులు జరిపి సర్వేలో ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్)ను ఆర్వీ అసోసియేట్స్ అందించింది. ఎటువంటి గ్రామాల ముంపు లేకుండా 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీలు కట్టవచ్చని తెలిపింది. తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఎటువంటి ముంపు ఉండదని పీఎఫ్ఆర్‌లో పేర్కొంది. 150 మీటర్ల ఎత్తుతో అయితే 4215 ఎకరాల నదీ గర్భం, చాప్రాల ఎకో సెన్సివిటీ జోన్‌కు చెందిన 943 ఎకరాలు ముంపునకు గురికానుండగా, 1018 ఎకరాలు సేకరిస్తే చాలునని గుర్తు చేసింది.
148 మీటర్ల ఎత్తుతో 2015లోనే అనుమతి
వాస్తవానికి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించుకోవడానికి 2016 మార్చి 8న మహారాష్ట్రతో ఒప్పందం కూడా జరిగింది. దీనిని 165 టీఎంసీలతో చేపట్టగా, 2015 ఫిబ్రవరి 13న హైడ్రాలజీ అనుమతి కూడా లభించింది. ఇరిగేషన్ ప్లానింగ్, అంతర్రాష్ట్ర క్లియరెన్స్, సెంట్రల్ సాయింట్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (భూమి ఏ విధంగా ఉందనే దానిపై), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు(భూగర్భ జలాలపై), కన్‌స్ట్రక్షన్ మిషనరీ కన్సలెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనుమతులు వచ్చాయి. ఇక పర్యావరణ అనుమతి కోసం తెలంగాణలో 2011 ఏప్రిల్‌లో బహిరంగ విచారణ జరపగా.. మహారాష్ట్రలో మాత్రం ఈ పని పూర్తికాలేదు. అయితే పలు అనుమతులు ఇదివరకే ఉండటంతో ఢిల్లీలో జరిగే భేటీలో మహారాష్ట్రను అధికారుల స్థాయిలో ఒప్పించే పనిలో ప్రభుత్వం పడింది. అధికారుల స్థాయిలో సమావేశం అనంతరం సీఎంల స్థాయిలో తదుపరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. మహారాష్ట్రను ఏ విధంగానైనా 150 మీటర్లతో బ్యారేజీ కట్టడానికి ఒప్పించాలని ప్రభుత్వం ఉంది. దాంతో కీలక సమావేశం ఐదురోజుల్లో జరుగనుంది.
జలవివాదాలపై తెలుగు రాష్ట్రాలతో 7న భేటీ
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాలపై పరిష్కరించడానికి వీలుగా ఉన్న వివాదాలను తేల్చడానికి సీడబ్ల్యూసీ సెప్టెంబరు 7న సమావేశం నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కమిటీలో ఏపీ తరఫున ఆ రాష్ట్ర జలనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ సలహాదారు, ఈఎన్‌సీ(ఇరిగేషన్), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉండగా, తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ సలహాదారు, శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ(జనరల్)లు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు అధికారుల పేర్లు పంపించగా.. నలుగురికే కేంద్రం చోటు కల్పించింది