నా కూతురి పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందని..భగీరథే అన్నాడంటే అర్థం చేసుకోండి
ABN , Publish Date - May 16 , 2026 | 05:17 AM
మేము పెంచిన చలాకీ పిల్ల ఇక మాకు లేదు. నా కుమార్తె పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందని బండి భగీరథే అన్నాడంటే మా బిడ్డ పరిస్థితిని అర్థం చేసుకోండి. మా బిడ్డను కాపాడమని, మా న్యాయపోరాటాన్ని....
మేము పెంచిన చలాకీ పిల్ల మాకు లేదు
శారీరక సంబంధం కోసం నా కుమార్తెపై పదేపదే ఒత్తిడి తెచ్చాడు
మొబైల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు
భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు.. బాధిత బాలిక తల్లి బహిరంగ లేఖ
హైదరాబాద్, మే15 (ఆంధ్రజ్యోతి): ‘‘ మేము పెంచిన చలాకీ పిల్ల ఇక మాకు లేదు. నా కుమార్తె పరిస్థితి చూస్తే ఆందోళనగా ఉందని బండి భగీరథే అన్నాడంటే మా బిడ్డ పరిస్థితిని అర్థం చేసుకోండి. మా బిడ్డను కాపాడమని, మా న్యాయపోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకొనే దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నా’’ బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులోని బాధిత బాలిక తల్లి ఆవేదన ఇది. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ బహిరంగ లేఖ రాశారు. తన కుమార్తెపై బండి భగీరథ్ చేసిన అఘాయిత్యం, తన కుమార్తె పడిన ఆవేదన, తమకు పోలీసు స్టేషన్‌లో ఎదురైన అనుభవం, కావాలనే తమ బిడ్డపై చేసిన దుష్ప్రచారం, బండి భగీరథ్, ఆయన తండ్రి వల్ల తమ కుటుంబానికి ఉన్న హాని తదితర అంశాలపై ఆ లేఖలో తన ఆవేదనను తెలియజేశారు.
ఆ లేఖలోని వివరాలు ఆమె మాటల్లోనే..
‘‘ పోక్సో చట్టం కింద నమోదైన ఓ కేసులో బాధితురాలైన నా కుమార్తె తరఫున తల్లిగా నిస్సహాయ స్థితిలో ఈ ప్రకటన చేస్తున్నా. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తు అందరిలానే పొందే హక్కు ఉంది. మేము సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్లం. మాకు రాజకీయం రాదు. పలుకుబడి లేదు. మా బిడ్డను ఎన్నో ఆశలతో పెంచుకున్నాం. మా బిడ్డకు రక్షణ కల్పించమని వ్యవస్థల ముందుకొచ్చి న్యాయం కోసం వేడుకుంటామని ఎప్పుడూ ఊహించలేదు.
ఈ లేఖ ప్రతీకారం కోసమో ప్రచారం కోసమో కాదు. మౌనం కంటే మాట్లాడటమే ఇప్పుడు తక్కువ బాధగా అనిపించడంతో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌తో 2025లో తనకు పరిచయమైందని మాకు మా అమ్మాయి చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా మొదలై.. ఆ తర్వాత భగీరథ్ పదేపదే మాట్లాడడం, బలవంతంగా ఒప్పించడం, ప్రలోభాలకు గురి చేయడం వల్ల నా కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడింది. మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో మా కుమార్తె బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్లిపోయింది. తనకు ఇష్టం లేకపోయినా, అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించినా శారీరక సంబంధం కోసం భగీరథ్ మా కుమార్తెపై పదేపదే ఒత్తిడి తీసుకొచ్చారు. నా కుమార్తె చెప్పిన మాటలు విన్నాక తల్లిగా నేను పడిన బాధను మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా 2025 డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచి 2026 జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకుమొయినాబాద్‌లో తనపై జరిగిన దాడిని మా కుమార్తె తెలిపింది. తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తెచ్చిన భగీరథ్.. అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచిత ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశాడని తెలిపింది. ఆ ఘటనలను గుర్తు చేసుకున్న ప్రతీసారి మా కుమార్తె కళ్లల్లో భయం, అవమానం ఇప్పటికీ కనిపిస్తున్నాయి. బండి భగీరథ్ ఆ తర్వాత చాట్ ద్వారా, మొబైల్ ద్వారా పదేపదే క్షమాపణలు చెప్పాడు. బాధ కలిగించినట్టు అంగీకరించి క్షమాపణ కోరాడు. ఈ సంఘటనల తర్వాత 2026 జనవరిలో మా కుమార్తె మానసికంగా మరింత కుంగిపోయింది. ఒంటరిగా కూర్చోని ఏడవడం, ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రతి రోజు నరకం అనుభవించడం చూశాం. చివరికి బండి భగీరథ్ కూడా నా కూతురి పరిస్థితి చూసి ఆందోళనగా ఉందని అన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత మానసిక నష్టాన్ని కలిగించాడో అర్థం చేసుకోండి. ఇక, 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ధైర్యం చేశాం. కానీ మాకు పరోక్ష ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి.
2026 ఏప్రిల్ 21న అకస్మాత్తుగా మా కుటుంబంపై వసూళ్లు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఇరువర్గాలకు సంబంధమున్న ఓ వ్యక్తి ద్వారా ఇది జరిగింది. సాధారణ పౌరులమైన మేము దాంతో భయపడిపోయాం. బాధితులైన మాపైనే నిందితులు అని ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో ఏప్రిల్ 22న సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన సూచన మేరకు ఆ మరుసటి రోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లాం. బాధలో ఉన్న మా కుమార్తెకు భరోసా, రక్షణ, మానవీయ స్పందన లభిస్తుందని ఆశపడ్డాం. కానీ, తిరిగి వచ్చేటప్పుడు మా గుండెలు భయంతో నిండిపోయాయి. రాజకీయ ప్రభావం, మద్దతుదారులు మా కుటుంబానికి ఇబ్బంది కలిగించవచ్చని అనిపించింది. ఆ రోజు నుంచి నేటి వరకు మా కుటుంబం మొత్తం నిరంతర భయం, మానసిక ఒత్తిడిలో జీవిస్తున్నాం.
ఆ 5 గంటలు ఆవేదన వర్ణనాతీతం
2026 మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరాం. మైనర్ అయిన మా అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించినప్పటికీ పోలీసులు మమ్మల్ని ఐదు గంటలు వేచి ఉండేలా చేశారు. మా కుమార్తె అప్పటికే కుంగిపోయి ఉంది కేసు నమోదు చేసి తమను పంపించాలని పదేపదే కోరాం. కానీ, కేసు పరిధి అని రకరకాల కారణాలు చెబుతూ పోలీసులు కాలయాపన చేశారు. ఫిర్యాదును ఇతర పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసే అవకాశముందని తెలిపారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానం గురించి మేము పట్టుబట్టిన తర్వాతే రశీదు జారీ చేశారు. ఓ ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆ ఐదు గంటలు మాకు ఆవేదనాభరితం. అదే సమయంలో మా కుటుంబంపై కరీంనగర్ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైందనే విషయం మాకు తెలిసింది. ఈ సంఘటనల క్రమం, పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. మా బిడ్డను రక్షించాల్సిన సమయంలో మాపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు రావడం ఆందోళనకు గురి చేశాయి. అందుకే సీసీ టీవీ ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, ఎఫ్‌ఐఆర్ మెటాడేటా, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదు రిజిష్టర్లు ఇతర ఎలకా్ట్రనిక్ ఆధారాలను భద్రపరచాలని కోరాం. మా కుమార్తెకు కలిగిన ఈ ఆవేదన మరొకరికి కలగకూడదు. కొందరు కావాలనే దీనీని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
బాధితురాలు తన ఆరోపణలను స్పష్టంగా చెప్పినప్పటికీ పోలీసులు కేసు నమోదులో బెయిల్ పొందదగిన సెక్షన్లనే చేర్చారు. ప్రజల ఆందోళన, సిట్ దర్యాప్తు అనంతరం ఈ కేసులో సెక్షన్లను మార్చి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ చర్యను మేము స్వాగతిస్తున్నాం కానీ.. నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతుండడం మమ్మల్ని కలిచి వేస్తోంది. మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా మా కుటుంబంపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు మాకు తీవ్ర భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డపై జరిగిన దాడి అంశంలో విచారణ నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా జరగాలని కోరుకుంటున్నాం. మైనర్ అయిన మా బిడ్డ ఫొటోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తున్న కొందరు ఆమె గుర్తింపు తెలిసేలా చేస్తున్నారు. మైనర్ గుర్తింపు, గౌరవాన్ని కాపాడడం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత కూడా. ఇక, నా బిడ్డ వయస్సుకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తెచ్చి కావాలనే విచారణను ఆలస్యం చేస్తున్నారు. పత్రాల్లోని విధానపరమైన వ్యత్యాసాలు ఒక చిన్నారి అనుభవించిన బాధను చెరిపేయలేవు. ఆమె మైనర్ అని సమగ్ర ఆధారాలు స్పష్టంగా సూచిస్తున్నపుడు పోక్సో చట్టం కల్పించిన రక్షణలను నిర్వీర్యం చేయలేవని మేము గట్టిగా నమ్ముతున్నాం. బాధిత బాలిక తల్లిగా చేతులు జోడించి ఒక్కటే చెబుతున్నా.. మీడియా సానుభూతి, రాజకీయ ఘర్షణ, ప్రజా ఆందోళనలను మేము కోరుకోవడం లేదు. ఈ దేశంలోని ప్రతి సాధారణ పౌరునికి దక్కాల్సిన న్యాయం మాకు దక్కాలని కోరుతున్నాం. నిష్పక్షపాత దర్యాప్తు, ఆఽధారాల రక్షణ, మా కుమార్తె గౌరవ పరిరక్షణ కోరుతున్నాం. మా కుటుంబం వద్ద ఉన్న పలు ఎలక్ర్టానిక్స్ కమ్యూనికేషన్లు, ఛాట్స్, సందేశాలు నిందితుడు పలుమార్లు క్షమాపణలు కోరడం, భావోద్వేగంగా కుంగిపోవడం, బాధ కలిగించిన విషయాన్ని అంగీకరించడం, క్షమించాలని వేడుకోవడం వంటి విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఈ సందేశాల్లో కొన్నింటిలో శారీరిక సంబంధాల కోసం పదేపదే ఒత్తిడి చేసినట్లు కన్పిస్తోంది. ఆ డిజిటల్ ఆధారాలను భద్రపరిచి మార్పులు చేర్పులు చేయకముందే ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించాలని కోరుతున్నాం. అధికారాన్ని పక్కన పెట్టి చట్టాన్ని సమానంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.