లైంగికదాడి కేసులో యావజ్జీవం
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:59 AM
ఓ బాలికపై లైంగికదాడి జరిపిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష పడిన నేరస్థుడు బెయిల్ మీద బయటకు వచ్చి.. మళ్లీ అదే బాలిక వెంటపడి వేధించి, కిడ్నాప్ చేయడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసారి అతడికి ఏకంగా యావజ్జీవ జైలుశిక్ష పడింది
నల్లగొండ ప్రత్యేకకోర్టు సంచలన తీర్పు
పోక్సో, ఎస్సీ ఎస్టీ, కిడ్నాప్ చట్టాల కింద
నేరస్థుడిపై ఏకకాలంలో 3 శిక్షలు
బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం
నల్లగొండ క్రైం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఓ బాలికపై లైంగికదాడి జరిపిన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష పడిన నేరస్థుడు బెయిల్ మీద బయటకు వచ్చి.. మళ్లీ అదే బాలిక వెంటపడి వేధించి, కిడ్నాప్ చేయడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసారి అతడికి ఏకంగా యావజ్జీవ జైలుశిక్ష పడింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా అత్యాచార, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి కులకర్ణి విశ్వనాథ దిలీ్‌పరావు గురువారం తీర్పునిచ్చారు. ఈ తీర్పుకు సంబంధించిన వివరాలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్‌కుమార్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన షేక్ ఖయ్యూం అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతడిపై నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2023లో కిడ్నాప్ తదితర కేసులు నమోదయ్యాయి. తమ ఇంట్లోకి చొరబడి 32.600 గ్రాముల బంగారం, 50గ్రాముల వెండిని దొంగిలించడంతోపాటు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్, దొంగతనం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఖయ్యూంను, బాలికను గుర్తించి తీసుకువచ్చారు. ఖయ్యూం ఆ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేగాక పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. .
2023 సెప్టెంబరులో జిల్లా ప్రత్యేక న్యాయస్థానంలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తదనంతరం న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు గురువారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, షేక్ ఖయ్యూం బాధిత బాలికను 2021లోనూ కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడటంతో ఆ కేసులో 2023లో ఇదే న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఖయ్యూం మళ్లీ ఆ బాలిక మీద మళ్లీ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో తాజా కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం కింద యావజ్జీవ జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా, బాలికను కిడ్నాప్ చేసిన నేరం కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానాను న్యాయాధికారి విధించారు. ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలుచేయాలని స్పష్టం చేశారు. బాధితురాలైన బాలికకు రూ.7లక్షల పరిహారాన్ని పునరావాసం కోసం అందించాలని న్యాయాధికారి ఆదేశించారు
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్