ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపై సీఎం రేవంత్ విచారం..
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:53 PM
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12: ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఆశా భోంస్లే మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటు. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. ఆశా కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆశా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.
ఆశా భోంస్లే గొంతు అమరం: మంత్రి కోమటిరెడ్డి
లెజెండరీ గాయని ఆశా భోంస్లే మరణంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణం కేవలం సినీ రంగానికే కాకుండా, యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. ఏడు దశాబ్దాలకు పైగా వేల సంఖ్యలో పాటలు పాడి.. సంగీత ప్రియులను అలరించిన ఆమె గొంతు అమరం అంటూ కీర్తించారు. ఆశా భోంస్లే శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ సాంగ్స్ వరకు, అన్ని భాషల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప గాయని అన్నారు. సంగీత రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను 'దాదాసాహెబ్ ఫాల్కే', 'పద్మ విభూషణ్' వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించిందని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి
ఇజ్రాయెల్‌కు తుర్కియే వార్నింగ్.. దాడి చేయటం మా కర్తవ్యం..
చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..