కృష్ణమ్మ పరవళ్లు
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:26 AM
ఎగువ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతించినా.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.36 లక్షల క్యూసెక్కుల వరద రాగా..
జూరాలకు 1.92, శ్రీశైలానికి 1.49
లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం
రాష్ట్రంలో విచిత్ర వాతావరణం
మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన
హైదరాబాద్‌లో భారీ వర్షం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతించినా.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.36 లక్షల క్యూసెక్కుల వరద రాగా... 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 1.28 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 1.29 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... దాదాపు అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ నా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా... 800 క్యూసెక్కులను ఎత్తిపోతల పథకాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిసామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 92.04 టీఎంసీల నీరు ఉంది. జలాశయంలోకి రోజూ దాదాపు 13 టీఎంసీలకు పైగా వరద జలాలు వస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే పదిరోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉంది. మరోవైపు గోదావరి నదిలో క్రమంగా వరద తగ్గుతున్నప్పటికీ.. కృష్ణానదిలో కంటే అధికంగానే ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి 2.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. సమ్మక్కసాగర్ (తుపాకులగూడెం)కు 4.12 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)కు 7.12 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
ఎండ.. వాన దోబూచులాట
రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. జూలై చివరివారంలో నాలుగైదు రోజులపాటు వర్షం వదలకుండా పడగా.. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. పగలంతా తీవ్ర వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటూ.. సాయంత్రం కాగానే వర్షం పడుతోంది. సోమవారం 27 జిల్లాల్లో 35 డిగ్రీలకుపై గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారంపాటు ఇవే పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని చెప్పారు. 9వ తేదీ వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సె.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కొడంగల్‌లో 10.13 సె.మీ వర్షం పడింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాప్రా, ఉప్పల్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, రాణిగంజ్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. కాప్రాలో 6.9 సెం.మీ, ఏఎ్‌సరావునగర్‌లో 4, ఉప్పల్‌లో 4 సెం.మీ వర్షం కురిసింది. ఉద్యోగులు విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జేఎన్టీయూ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది రోడ్లపై నీటిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..