Share News

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా?రాహుల్‌ గాంధీకి కిషన్‌రెడ్డి సవాల్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:50 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సవాల్‌ చేశారు.

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా?రాహుల్‌ గాంధీకి కిషన్‌రెడ్డి సవాల్‌

  • చేతగాకపోతే రేవంత్‌ వైదొలగాలి

  • కేసీఆర్‌ను కాపాడుతోంది ఎవరని ప్రశ్న

హైదరాబాద్‌/పటాన్‌చెరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి సవాల్‌ చేశారు. సోనియా, కేసీఆర్‌ కుటుంబాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏ శక్తి అడ్డుపడుతుందో చెప్పాలని సీఎం రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. చర్లపల్లి జైలులో కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన రేవంత్‌, ఇప్పుడు ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోలేకపోతే రాజీనామా చేయాలని రేవంత్‌ను డిమాండ్‌ చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు అంశాన్ని రేవంత్‌ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడం చేతగాక సీఎం తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘నాటి కేసీఆర్‌ ప్రభుత్వం, ప్రస్తుత రేవంత్‌ సర్కార్‌ మజ్లి్‌సకు బానిసలు. ఈ రెండు పార్టీలది బానిస పాలనే. కారు స్టీరింగ్‌ తమ చేతిలోనే ఉంటుందని కేసీఆర్‌నుద్దేశించి నాడు అసదుద్దీన్‌ ప్రకటిస్తే, రావు అయినా రెడ్డి అయినా తమ కాళ్ల వద్దే ఉంటారంటూ ఇప్పుడు అక్బరుద్దీన్‌ అంటున్నారు’’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ట్యాపింగ్‌లో సొంత అల్లుడినీ వదల్లేదు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సొంత అల్లుడిని కూడా కేసీఆర్‌ వదల్లేదని, ఈ విషయాన్ని స్వయంగా కవితనే చెప్పిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మునిసిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో అసైన్డ్‌, ప్రభుత్వ భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. పదవి దిగిన తర్వాత మామా అల్లుడు ఆస్తుల కోసం రోడ్డెక్కి కొట్లాడుకుంటున్నారని చెప్పారు. హరీశ్‌రావు రూ.వేల కోట్లు సంపాదించారంటూ కవిత ప్రచారం చేస్తోందన్నారు.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం ఆందోళనకరం

హైదరాబాద్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఆందోళనకరమని కిషన్‌రెడ్డి అన్నారు. కాలిపోయిన కంప్యూటర్లలో ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుల సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 08 , 2026 | 05:59 AM