Share News

ఏసీబీకి చిక్కిన కీసర ఎస్‌ఐ శ్రీనివాస్‌

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:17 AM

మేడ్చల్‌ జల్లా కీసర ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి దొరికి పోయాడు.

ఏసీబీకి చిక్కిన కీసర ఎస్‌ఐ శ్రీనివాస్‌
ACB Raids

  • రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

  • గతంలో ఇదే పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐపై ఏసీబీ కేసు

  • బెయిల్‌ నుంచి చార్జిషీట్ల వరకు వసూళ్ల ఆరోపణలు

హైదరాబాద్‌, కీసర రూరల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌ జల్లా కీసర ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి దొరికి పోయాడు. చీటింగ్‌ కేసు, 498ఏ కేసుల్లో చార్జిషీట్లు త్వరగా దాఖలు చేసేందుకు నిందితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చార్జిషీట్ల దాఖలులో జాప్యం చేస్తానని ఎస్‌ఐ హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు వల పన్ని శిల్పా లేఅవుట్‌ సమీపంలో నగదు తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు. కీసర పోలీస్‌ స్టేషన్‌లో నెలన్నర వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు ఏసీబీకి చిక్కారు. సెప్టెంబర్‌ 16న కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌ రెడ్డి రూ.5 లక్షల లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. తాజాగా అదే పీఎ్‌సలో చార్జీషీట్‌ దాఖలు చేసేందుకు లంచం తీసుకుంటూ మరో ఎస్‌ఐ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది.


వరుస ఘటనలతో దుమారం

అక్టోబర్‌ 27న మిర్‌చౌక్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.కొండల్‌రావు, హోంగార్డు అబిద్‌ అలీ ఏసీబీకి చిక్కారు. కేసును మూసివేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డుపై కేసు నమోదు చేశారు. ఆగస్టు 22న చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ బి.బాలరాజు, కానిస్టేబుల్‌ బి.రాఘవేంద్రకుమార్‌ రూ.75 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ క్రిమినల్‌ కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు విషయంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకున్నారు.

మే 21న బోయిన్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌ నందిత, కానిస్టేబుల్‌ బి.విజయ్‌కుమార్‌ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. బెయిల్‌ నిబంధనలను సడలించేందుకు లంచం తీసుకున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 06:49 AM