Share News

నోటీసులు అక్రమం.. ఐనా విచారణకు వస్తున్నా

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:01 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను సిట్‌ అధికారులు హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారించనున్నారు.

నోటీసులు అక్రమం.. ఐనా విచారణకు వస్తున్నా
KCR

  • నందినగర్‌ ఇంట్లో నేడు విచారణకు కేసీఆర్‌ ఓకే

  • 3 గంటలకు అందుబాటులో ఉంటానని కబురు

  • బీఆర్‌ఎస్‌ ఆందోళనల నేపథ్యంలో భారీ బందోబస్తు

  • ఎర్రవల్లిలో ఉంటున్నానని చెప్పినా మళ్లీ నోటీసా?

  • 65 దాటినందుకు నన్ను ఉన్నచోటే విచారించాలి

  • సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా సిట్‌ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదు

  • ఎర్రవల్లిలోనే ఉంటున్నానని 29న లేఖలో స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోలేదు

  • ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది

  • సిట్‌ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్‌ సుదీర్ఘ లేఖ

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను సిట్‌ అధికారులు హైదరాబాద్‌ నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారించడానికి ఏర్పాట్లు చేశారు. విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతాన్ని బారికేడ్లతో దిగ్బంధనం చేసి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సిట్‌ అధికారులు పంపిన రెండో నోటీసుకు కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. మూడు పేజీల సుదీర్ఘ లేఖను జూబ్లీహిల్స్‌ ఏసీపీకి పంపారు. సిట్‌ అధికారులు ఇచ్చిన నోటీసు చట్టప్రకారం లేదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన వ్యక్తిగా విచారణలో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌ నివాసంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. కేసీఆర్‌ తన లేఖలో పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. సిట్‌ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని, ద్వంద్వవైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. పంజాగుట్టలో నమోదైన క్రైం నెంబర్‌ 243 కేసు విచారణలో భాగంగా సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ కింద సిట్‌ అధికారులు ఈ నెల 29న ఇచ్చిన నోటీసుకు తాను అదే రోజున జవాబు పంపానని చెప్పారు. సెక్షన్‌ 160 ప్రకారం 65 ఏళ్లు వయస్సు పైబడిన వారిని విచారించాల్సి వస్తే వారు నివసిస్తున్న ప్రదేశానికి దర్యాప్తు అధికారి వెళ్లి విచారణ చేపట్టాలని చట్టం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు.


తాను ఎర్రవెల్లిలో ఉంటున్నానని, ఈ కేసుకు సంబంధించి తదుపరి సమాచారం ఏదైనా ఆ చిరునామాకే పంపించాలని కోరానని ప్రస్తావించారు. 30న గుర్తు తెలియని వ్యక్తులు నందినగర్‌కు వెళ్లి, అక్కడ తన గురించి విచారించి, తాను లేనని తెలుసుకుని గోడకు లేఖ అంటించడంపై కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎర్రవెల్లిలో ఉంటున్న విషయాన్ని స్పష్టంగా 29వ తేదీన లేఖలో పేర్కొన్నప్పటికీ సిట్‌ అధికారులు ఎన్నికల అఫిడవిట్‌, అసెంబ్లీ రికార్డుల ప్రకారం నందినగర్‌ ఇల్లు అధికార చిరునామా అవుతుందని పేర్కొంటూ అక్కడ నోటీసులు అంటించడాన్ని ఖండించారు. అసెంబ్లీ, ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారమే దర్యాప్తు అధికారులు వ్యవహరించాల్సి వస్తే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న సిద్దిపేట ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని, ఆయనకు హైదరాబాద్‌లో నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ నోటీసులకు సంబంధించి సత్యేంద్ర కుమార్‌ వర్సస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేసీఆర్‌ ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని అన్నారు. సీఆర్‌పీసీ 160 ప్రకారం నోటీసు ఇస్తున్నపుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 62(2)ను కూడా దర్యాప్తు అధికారులు చదువుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. నోటీసు ఎవరికి ఇవ్వదలచుకున్నారో ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రదేశానికి వెళ్లి నోటీసును అందచేయాల్సి ఉండగా సిట్‌ చట్టాన్ని అతిక్రమించి తాను ఉండని ప్రదేశానికి వెళ్లి గోడపై ఎలా అంటిస్తారని ప్రశ్నించారు. చట్టం దృష్టిలో అది నోటీసే కాదని చెప్పారు.


భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ప్రకారం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్‌ 14 ప్రకారం చట్ట సమానత్వం అనే అంశాలను సిట్‌ ఉల్లంఘించిందని లేఖలో కేసీఆర్‌ ఆరోపించారు. సిట్‌ అధికారుల చర్య కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. తాను జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే నివసించనపుడు అసలు తనకు నోటీసులు ఇచ్చే అధికారమే జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేదని కేసీఆర్‌ అన్నారు. చట్టవిరుద్ధమైన నోటీసులకు తాను కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వీడీమూర్తి వర్సస్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, మహిళలను వారు నివసిస్తున్న చోటే విచారణ జరపాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. శాసనసభ రికార్డుల ప్రకారం చిరునామా చూసి నోటీసు ఇచ్చామని చెబుతున్నప్పటికీ నోటీసు ఇచ్చే సమయానికి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండాలని గుర్తు చేశారు. తాను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలో ఉంటున్నది జగమెరిగిన సత్యమని చెప్పారు. చట్ట ప్రకారం తనను విచారించాలంటే ఎర్రవల్లికే రావాల్సి ఉంటుందని చెప్పారు. దర్యాప్తు అధికారికి ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఉన్నప్పటికీ అది తన జ్యూరిస్డిక్షన్‌ పరిధిలో ఉన్న వారి విషయంలోనే వర్తిస్తుందని చెప్పారు. తాను జూబ్లీహిల్స్‌ పరిధిలో నివసించడం లేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరహా ఉత్తర్వులే ఢిల్లీ, హిమాచల్‌ హైకోర్టులు సైతం ఇచ్చాయని చెప్పారు. సిట్‌ అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే తాను నందినగర్‌లో విచారణకు హాజరు కాకుండా సిట్‌ నోటీసును తోసిపుచ్చవచ్చని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుత పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తూ సిట్‌ తప్పుడు నోటీసులు ఇచ్చినా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు.


హైదరాబాద్‌ చుట్టుపక్కల జన సమీకరణ

ఉదయం 9 గంటల సమయంలో ఎర్రవల్లి నివాసం నుంచి కేసీఆర్‌ బయల్దేరతారు. 11 గంటలకు నందినగర్‌ నివాసానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సమీపీ ప్రాంతాల నుంచి జనసమీకరణ చేసేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో 3వేల మందికి భోజనాలఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

పీఎస్‌కు వెళ్దామనుకున్నా..

జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లడమా లేక నందినగర్‌ ఇంట్లోనే విచారణకు అందుబాటులో ఉండటమా అనే అంశంపై బీఆర్‌ఎస్‌ అధినేత పార్టీ నేతలతో చర్చించారు. పీఎస్‌కు వెళ్లడం వల్ల పార్టీకి ప్లస్‌ అవుతుందని అత్యధికులు భావించారు. అయితే, విచారణ జరిగేది రెండో అంతస్తులో కావడం, అన్ని మెట్లు ఎక్కి కేసీఆర్‌ వెళ్లడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. ఇటీవలే సిట్‌ విచారణకు పీఎస్‌కు వెళ్లిన కేటీఆర్‌, హరీశ్‌ ఎన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుందో కేసీఆర్‌కు వివరించారు. కేసీఆర్‌ తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో రెండతస్తులు ఎక్కడం ఇబ్బంది అని నందినగర్‌ ఇంటికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆపరేషన్‌ స్మైల్‌లో 5,582 మంది చిన్నారులకు విముక్తి

ట్రాఫిక్‌లో నరకయాతన!

Updated Date - Feb 01 , 2026 | 09:04 AM