ఆపరేషన్ స్మైల్‌లో 5,582 మంది చిన్నారులకు విముక్తి
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:30 AM
బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా తెలంగాణలో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ద్వారా 5,582 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు.
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా తెలంగాణలో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ ద్వారా 5,582 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. జనవరి 1నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించామని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. 121 సబ్ డి విజనల్ పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయని, మహిళా శిశు సంక్షేమశాఖ, కార్మిక ఆరోగ్య శాఖలతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు భాగస్వాములయ్యాయని ఆమె వివరించారు. 15 రాష్ట్రాలకు చెందిన 474మంది బాలికలను కాపాడామన్నారు. 4,567మంది బాల కార్మికులుగా పనిచేస్తుండగా, 486 మంది వీధి బాలలుగా తిరుగుతున్నారని, 38మంది భిక్షాటన చేస్తున్నారని, మరో 491మంది ఇతర పనుల్లో మగ్గిపోతున్నారని చారుసిన్హా తెలిపారు. 1480 కేసులు నమోదు చేసి, 1483మంది నిందితులను అరెస్టు చేశామని, రూ.41.78లక్షల జరిమానా విధించామన్నారు. తాము రక్షించిన వారిలో 43మంది నేపాల్‌కు చెందిన పిల్లలున్నారని, మొత్తం 4,978మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చామని, మిగిలిన 604మందిని రక్షణ గృహాలకు తరలించి ఆశ్రయం కల్పించామని చారుసిన్హా తెలిపారు.