Share News

ట్రాఫిక్‌లో నరకయాతన!

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:33 AM

మేడారంలో అదే సమస్య! వాహనాలు ముందుకు కదలక.. వెనక్కివెళ్లే వీలూ లేక గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే! ఇలా తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి...

ట్రాఫిక్‌లో నరకయాతన!

  • 12గంటలు రోడ్లపైనే భక్తులు.. 15 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌

  • ఆకలిదప్పులకు తాళలేక భక్తుల అవస్థలు

  • వీఐపీ వాహనాలతోనే ట్రాఫిక్‌ సమస్య

  • భక్తుల్లో ఆగ్రహం.. వాహనాలపై దాడులు

మేడారం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మేడారంలో అదే సమస్య! వాహనాలు ముందుకు కదలక.. వెనక్కివెళ్లే వీలూ లేక గంటలకొద్దీ ట్రాఫిక్‌లోనే! ఇలా తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి శనివారం మధ్నాహ్నం దాకా భక్తులు నరకం చూశారు! కిక్కిరిసిన ట్రాఫిక్‌లో 12 గంటలపాటు చిక్కుకుపోయి ఆకలిదప్పులతో అలమటించారు. మహాజాతరలో ట్రాఫిక్‌ నియంత్రించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఎంతో మంది ప్రయాణికులు ట్రాఫిక్‌ నరకయాతన తాళలేక మధ్యలోనే బస్సుల్లోంచి దిగి కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. అయితే మహాజాతరలో వీఐపీ, వీవీఐపీ వాహనాలతోనే ట్రాఫిక్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు చెబుతున్నారు. మహా జాతర ప్రారంభానికి 20 రోజుల ముందే పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. తాడ్వాయి నుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని సూచనలు చేసినా.. పోలీస్‌ యంత్రాంగం మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా వీఐపీ, వీవీఐపీ వాహనాలకు కూడా అనుమతించడంతో సమస్యాత్మకంగా మారింది. కొన్నిచోట్ల ప్రయాణికులు ఆగ్రహంతో ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. పస్రా-తాడ్వాయి మధ్య 15 కి.మీ మేర ఆరేడు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 11 గంటల తర్వాత ట్రాఫిక్‌ క్లియర్‌ అయింది.


రెండ్రోజుల్లో 4 లక్షల మంది భక్తుల చేరవేత

వారం రోజులుగా మేడారం తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో రెండు రోజుల్లో సుమారు 4వేల బస్సుల్లో 4లక్షల మందికి పైగా ప్రయాణికులను చేరవేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే మేడారం నుంచి తాడ్వాయి వైపు వెళ్లే బస్సులు తాడ్వాయి వైపు కాకుండా నార్లాపూర్‌, చింతల్‌ మీదుగా పస్రాకు చేరుకుని వివిధ రూట్లకు వెళ్తున్నాయి. దీంతో ఉదయం నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా భక్తుల తిరుగు ప్రయాణం సాఫీగా కొనసాగుతోంది. జాతరలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు మండిపడ్డారు. అప్రమత్తమైన జాతర ట్రాఫిక్‌ ఇన్‌చార్జి వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సిబ్బందితో రోడ్లపై తిరుగుతూ నియంత్రణ చర్యలు చేపట్టారు. మేడారంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తిరుగు ప్రయాణంలో బస్సులను దారి మళ్లించినట్లు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 07:33 AM