Share News

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అన్యాయానికి సారీ

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:18 AM

బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అన్యాయానికి సారీ

  • ప్లేడే, పీహెచ్‌డీ అంశంలో 3లక్షల దాకా నష్టపోయారు

  • సింగరేణి కార్మికులతో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత

  • పవన్‌ కల్యాణ్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి

  • ఉద్యమకారుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో డిమాండ్‌

  • రవీంద్రభారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏంటని వ్యాఖ్య

  • సిరిసిల్ల సెస్‌ పోయినా కేటీఆర్‌ మాట్లాడట్లేదని విమర్శ

కరీంనగర్‌, యైుటింక్లయిన్‌కాలనీ, సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్లేడే (ఆదివారాలు), పీహెచ్‌డీ(పెయిడ్‌ హాలీడే)ల విషయంలో జరిగిన తప్పిదం వల్ల కార్మికులు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు. ఈ విషయంలో కార్మిక వర్గానికి కవిత క్షమాపణలు తెలియజేశారు. ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా-2లోని ఓసీపీ-3 ప్రాజెక్టులోని కార్మికులతో కవిత గురువారం ఈ మేరకు మాట్లాడారు. ఇక, కరీంనగర్‌లో గురువారం నిర్వహించిన ఉద్యమకారుల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌ వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటువాదంతో పోల్చిన సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లవారి నుంచే తెలంగాణ భావజాలంపై దాడి ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వేర్పాటువాదం, దేశద్రోహం అంటే కేసు పెట్టరా? సినిమావాళ్లకో న్యాయం, ఆంధ్ర వాళ్లకో న్యాయం, తెలంగాణ వాళ్లకో న్యాయమా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ కళాకారులకు అడ్డాగా ఉండాల్సిన రవీంద్ర భారతి ముందు సినీ కళాకారుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.


గద్దర్‌ పేరిట సినీ అవార్డులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గద్దర్‌ పేరుతో కళాకారులను తయారు చేసి, ఉద్యోగాలివ్వాల్సిందిపోయి అవార్డులు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వెనక బీజేపీ హస్తం ఉందని, బీజేపీ వస్తే మన ఊరి దేవుళ్లను మాయం చేస్తుందని కవిత అన్నారు. మరోపక్క,సిరిసిల్లలోని సెస్‌ మంగళహారతి అయిందని, ప్రభుత్వంలో కలిసిపోతుందని అయినా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. సిరిసిల్లలో గురువారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ జెండా పండుగ కార్యక్రమంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. రైతు డిస్కమ్‌ల అంశంపై కూడా కేటీఆర్‌ మాట్లాడడం లేదని.. రైతు డిస్కమ్‌ కావాలా ? వద్దా ? కేటీఆర్‌ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయినా, కేటీఆర్‌కు పాపం తీరికలేదని, వారాంతాల్లో సిరిసిల్లకు వచ్చిపోతుంటడని అందువల్లే మాట్లాడటం లేదేమోనని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన కోసం నేరెళ్ల సంఘటనలో ఎనిమిది మంది దళితులు, బీసీలను చిత్రహింస పెట్టారని ఆరోపించారు. ‘ఎందుకోసం చేశారు ఈ దాష్టీకం.. అధికారం ఉందని నీ ఇసుక బండికి అడ్డుపడ్డారని.. అక్రమ సంపాదనకు అడ్డుపడ్డారని పేదలపై ఆ కోపం తీస్తారా’ అని ప్రశ్నించారు.

Updated Date - Jun 19 , 2026 | 03:18 AM